PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా గురుపూజ దినోత్సవం..   

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : అజ్ఞానాన్ని అంధకారాన్ని తొలగించి బ్రహ్మవిద్య అనే ప్రకాశాన్ని శిష్యులకు అందించేవాడు గురువు అటువంటి గురువులను సత్కరించుకునే రోజైనటువంటి సెప్టెంబర్ 5వ తేదీన బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో ఘనంగా గురుపూజ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీరం విద్యాసంస్థల చైర్మన్ బీరం సుబ్బారెడ్డి , చైర్పర్సన్ సరస్వతమ్మ , డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ లు విచ్చేశారు. మొదట సభను ఉత్తమ గురువు మరియు విద్యావేత్త అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్  జన్మదినోత్సవం సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించడం జరిగింది.కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి తల్లియే తొలి గురువు అలాగే గురువులను పూజిస్తే మన తల్లిదండ్రులను పూజించినట్లు అని వారు చెప్పారు. గురువు నిరంతరం కొవ్వొత్తి లాగా తాను కరిగి విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తాడని, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని శాస్త్రాలలో చెప్పినట్లు తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుకు ఇవ్వాలని వారు విద్యార్థులకు తెలియజేశారు.   విద్యార్థులు ఎవరైతే గురువులకు గౌరవం ఇస్తారో వారు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదుగుతారని చెప్పారు. అలాగే బీరం శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను  అందిస్తున్నారని వారు ఉపాధ్యాయులను మెచ్చుకున్నారు. విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులందరికీ విద్యార్థుల చేత పాదపూజ చేయించి  శాలువాలు, పూలదండలతో వారిని ఘనంగా సత్కరించడం జరిగింది. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో సభను అలరింప చేశారు.  ఈ కార్యక్రమంలో బీరం పాఠశాల ప్రిన్సిపల్ శ్వేతా , కళాశాల ప్రిన్సిపల్ హేమ్ చందర్ , ఉపాధ్యాయులు, పీఈటీలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

 

About Author