లెక్క తేలిందా.. బాంబుల కలకలం ముగిసిందా..!
1 min read– ముచ్చుమర్రి లో మరో 5 నాటు బాంబులు లభ్యం.
– వనములపాడు గ్రామ సమీపంలోని శివాలయం సమీపంలో బాంబుల గుర్తింపు.
– ముచ్చుమర్రి లో కలకలం రేపుతోన్న బాంబుల వ్యవహారం.
– భయాందోళనలో గ్రామస్తులు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి లో మూడు నెలల కిందట కలకలం రేపిన నాటు బాంబుల వ్యవహారం లో మరో ఐదు నాటు బాంబులను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబుల తయారీ కేసులో నిందితుడు డబ్బల వెంకట స్వామి ఇచ్చిన సమాచారం తో ఆత్మకూరు డిఎస్పీ ఆదేశాల మేరకు నందికొట్కూరు రూరల్ సిఐ విజయ భాస్కర్ ఆధ్వర్యంలో ముచ్చుమర్రి ఎస్సై నాగార్జున, మిడుతూరు ఎస్సై జగన్మోహన్ లు బాంబు స్క్వాడ్ బృందం జాగిలాలు తో గాలింపు చర్యలు చేపట్టారు. పాత ముచ్చుమర్రి పంచాయతీ మజారా గ్రామం వనములపాడు గ్రామ సమీపంలోని శివాలయం వద్ద మొక్కజొన్న పంట పొలంలో బాంబు స్క్వాడ్ బృందం, పోలీసు జాగిలాలు భూమి లోపల సంచిలో దాచిపెట్టిన బాంబులను గుర్తించాయి. బాంబులను స్వాధీనం చేసుకుని పొలీస్ స్టేషన్ కు తరలించారు. జులై నెలలో 22 , సెప్టెంబర్ లో 4 ,ప్రస్తుతం సోమవారం 5 నాటు బాంబుల తో కలిపి మొత్తం 31 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కొనుగోలు చేసిన 31 నాటు బాంబులు దొరకడంతో బాంబుల లెక్క తేలిందా.. బాంబుల కథ ముగిసినట్లేనా అని గ్రామస్తులు చర్చించు కుంటున్నారు.
నాటు బాంబులు ఎక్కడివి..?
ఏపీ శాప్ ఛైర్మన్, వైసిపి యువ నాయకుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అనుచరుడి ఇంట్లో భారీగా నాటుబాంబుల కలకలం రేపుతున్నాయి. వైసిపి సోషల్ మీడియా కన్వీనర్ బోయ మధు ఇంటిపైన నీటి ట్యాంకులో రెండు కవర్లలో చుట్టిన 22 నాటుబాంబులు జులై 24 న బయటపడ్డాయి. దీంతో వెంటనే పోలీసులు నాటుబాంబులను స్వాధీనం చేసుకుని అవి ఎవరు దాచారు? ఎందుకు దాచారు? అన్నదానిపై దర్యాప్తు చేపట్టారు. బోయ మధు తన ఇంటిపై గల నీటి ట్యాంక్ ను క్లీన్ చేస్తుండగా కవర్లలో చుట్టిపెట్టిన గుండ్రని వస్తువులేవో గుర్తించారు. వాటిని ట్యాంక్ లోంచి బయటకు తీసి చూడగా నాటుబాంబులు వున్నాయి. దీంతో ఇంటి యజమాని మధుతో పాటు కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. వెంటనే మధు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
మధు ఇంటికి చేరుకున్న పోలీసులు నాటుబాంబులను పరిశీలించారు. వెంటనే వాటిని స్వాదీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి వాటర్ ట్యాంకులో నాటుబాంబులు దాచిందెవరో పోలీసులు విచారణ చేపట్టారు. మధు ఫిర్యాదు మేరకు కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో 31 నాటు బాంబులను కొనుగోలు చేసి నట్లు నిందితులు తెలిపారు. అందులో భాగంగా సెప్టెంబర్ 27 కొంతమందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కొన్నిరోజులకే గ్రామానికి చెందిన పెద్ద రంగడు ( పెద్ద రంగస్వామి ) ఇంటి ఆవరణలో 4 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు . ప్రస్తుతం సోమవారం డబ్బల వెంకటస్వామి ఇచ్చిన సమాచారంతో మరో 5 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 31 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో బాంబుల లెక్క తేలిందా ..బాంబుల కథ ముగిసినట్లేనా అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గ్రామంలో వరసగా నాటు బాంబులు బయట పడతుండడం తో గ్రామంలో భయాందోళనలు అలుముకున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో నని ప్రజలు భయపడుతున్నారు. ఏదిఏమైనా నాటు బాంబుల వ్యవహారం గ్రామంలో కలకలం రేపుతోంది.