పోటీదారులు..కష్టపడాలి..
1 min read
కార్పొరేషన్ ఎన్నికల్లో 33 వార్డుల్లో విజయం సాధించాలి
- అభివృద్ధి.. సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి
- సీఎం చంద్ర బాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి
- కర్నూలు నియోజకవర్గ మహానాడులో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
కర్నూలు: చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప నాయకుడు సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని ఆయన కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ మహానాడు కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుడా(KUDA) ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు దివంగత నాయకులు, పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆపరేషన్ సింధూర్‌లో ప్రాణాలర్పించిన జవానులకు సంతాపం తెలిపారు.
రైతు బజార్ అభివృద్దికి.. రూ.6 కోట్లు
అనంతరం రాష్ట్ర మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ వల్ల భవిష్యత్తులో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. కర్నూలు పర్యటనలో భాగంగా సీ.క్యాంపు రైతు బజార్‌ను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు రూ.6 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అన్న క్యాంటిన్ కూడా రైతు బజార్‌లో ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఇక్కడే కాకుండా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో రైతుబజార్లను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారన్నారు. ఓర్వకల్లు పారిశ్రామికవాడలో ఎన్నో పరిశ్రమలు రానున్నాయని, పాలనాపరమైన విధానాల కారణంగా ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుందన్నారు. కచ్చితంగా ఓర్వకల్లుకు పరిశ్రమలు వచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ఇటీవల జరిగిన ఎస్.ఐ.పి.బి సమావేశంలో కూడా వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారన్నారు. ఇక కర్నూల్లో బి.సి భవన్ నిర్మాణానికి తన తరపున కోటి రూపాయలు అందిస్తానని ప్రకటించారు.
కష్టపడే వారికే… సీటు…
కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఇప్పటినుంచే ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కరించి వారి మన్ననలు పొందాలని సూచించారు. గతంలో తనకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చేందుకు అధినేత చంద్రబాబు నాయుడు సర్వేలు చేయించారని, అయితే ప్రజల్లో తనకున్న గుర్తింపు కారణంగా సర్వేలన్నీ తనకు అనుకూలంగానే వచ్చాయన్నారు. అందుకే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం పోటీ చేసే వారు కచ్చితంగా కష్టపడాలన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 33 వార్డుల్లో విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ముంతాజ్, కొంకతి లక్ష్మీనారాయణ, సంజీవలక్ష్మి, జేమ్స్, రవికుమార్, కార్పొరేటర్లు పరమేష్, జకియా అక్సారీ, సుజాత, నీలోఫర్, విజయకుమారి, తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసెట్టి శ్రీనివాసులు, తెలుగుయువత పార్లమెంటు అధ్యక్షుడు అబ్బాస్, నగర మైనారిటీ అధ్యక్షుడు హమీద్, మాజీ కార్పొరేటర్లు, వార్డు ఇంచార్జీలు, క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, బూత్ ఇంచార్జీలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

