హజీరా బీ కుటుంబానికి… అండగా ఉంటాం..
1 min read– టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు నారా లోకేష్
పల్లెవెలుగు వెబ్, గోనెగండ్ల : కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన హజీరా బీ కుటుంబానికి బాసటగా నిలుస్తామన్నారు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు నారా లోకేష్. ఏడాది క్రితం అత్యాచారం, హత్యకు గురైన హజీరా బీ కుటుంబాన్ని మంగళవారం నారా లోకేష్‌తోపాటు, సీపీఎం రాష్ట్ర అధ్యక్షుడు మధు, సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ, రాష్ట్ర మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ శుబ్లీ, కాంగ్రెస్ నాయకులు తులసి రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హజీరా బీని అత్యాచారం, హత్య చేసిన మానవ మృగాళ్లను ఇప్పటి వరకు ఎందుకు శిక్షించ లేదని ఘాటుగా ప్రశ్నించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని ఈ సందర్భంగా నారా లోకేష్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే షడ్రక్, ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి, టిడిపి మంత్రాలయం సీనియర్ నాయకులు తిక్కా రెడ్డి, టిడిపి కర్నూలు పార్లమెంటు అధ్యక్షురాలు షేక్ ముంతాజ్ తదితరులు ఉన్నారు.