నులిపురుగుల నివారణతోనే ఆరోగ్యం
1 min read– ఈనెల 14న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
– జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: నులిపురుగుల నివారణతోనే సంపూర్ణ ఆరోగ్యమని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు. స్ధానిక కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో రాష్ట్రీయ బాల స్వాస్ధ్య (ఆర్ బి ఎస్ కె) కింద ఈనెల 14వ తేదీన నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం (నేషనల్ డివార్మింగ్ డే ) పై గురువారం వైద్య ఆరోగ్య , విద్య , సాంఘిక సంక్షేమం , మున్సిపల్ , మహిళ శిశు సంక్షేమం , తదితర శాఖల అధికారులతో జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో o1- నుంచి 19 సంవత్సరాలు లోపు బాల బాలికలకు నులిపురుగుల నివారణ మందు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు . చిన్నారులలో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న నులిపురుగులను నివారించి ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా ఈనెల 14 వ తేదీన నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు . ఇందులో భాగంగా ప్రతి చిన్నారికి నులిపురుగుల నివారణ ( అల్బెండజోల్ ) మాత్రను తప్పక వేయించాలన్నారు . జిల్లాలో 4 లక్షల 06 వేల 025 మందికి నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రలు సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ధేశించడం జరిగిందన్నారు . పంపిణీ చేసిన మాత్రలను చిన్నారులకు అందజేసేందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేయాలన్నారు .ఇందుకు సంబంధించిన వివరాలను మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలు తమకు నిర్ధేశించిన లాగిన్ లో పొందుపర్చి పిల్లలందరికి ఆయా పాఠశాలలు, కళాశాలల్లో ఎఎన్ఎం, ఆశా కార్యకర్తల ద్వారా పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో 2,90,665 మంది విద్యార్ధులకు, జూనియర్ కళాశాల, ఐటిఐ, పాలిటెక్నిక్, కళాశాలల్లోని విద్యార్ధులతోపాటు ఈ విడత ప్రత్యేకంగా అన్ని డిగ్రీకళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల్లోని మొదటి సంవత్సర విద్యార్ధులతో కలిపి మొత్తం మరో 40 వేల 224 మందికి ఆల్పెండజోల్ మాత్రలు అందించబడతాయన్నారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో 75, 136 మంది చిన్నారలకు కూడా మాత్రలు అందించబడతాయన్నారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి అక్కడ విద్యార్ధులందరకు అల్పెండజోల్ మాత్రలు అందంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అల్పెండజోల్ మాత్ర మూలంగా నులిపురుగుల నుండి ఏవిధమైన రక్షణ కులుగుతుంది, కూరగాయలు, పళ్లను శుభ్రమైన నీటితో కడిగి వినియోగించడం , చేతులు శభ్రపరచుకోవడం ఎప్పుడూ శుభ్రమైన నీటిని త్రాగడం వంటి అంశాలను కూడా విద్యార్ధులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్ధులు ఆల్పెండజోల్ మాత్ర వేసుకునే 10 నిమిషాల ముందు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 14వ తేది డీ వార్మింగ్ రోజున సంబంధిత పాఠశాల పరిధిలో సంబంధిత సచివాలయ కార్యదర్శలు ఆయా పాఠశాలల్లో పర్యవేక్షించాలని, అదే విధంగా సంబంధిత పాంత మెడికల్ ఆఫీసర్లు అందుబాటులో ఉండాలన్నారు. నిర్ధేశించిన మాసంలో గర్భిణీలకు కూడా ఈ మాత్రలు అందించాలన్నారు.రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం (ఆర్ బిఎస్ కె) జిల్లా కో-ఆర్డినేటర్ డా. సిహెచ్ మానస మాట్లాడుతూ నులిపురుగుల నిర్మూలనతో రక్తహీనత నియంత్రణ, పోషకాల గ్రాహ్యతను మెరుగుపరచే ప్రయోజనాలు కలుగుతాయన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 1 నుండి 2 సంవత్సరాల చిన్నారులకు (200 మి.గ్రా .) సగం మాత్ర ను పొడిచేసి సులభంగా మింగగలిగేలా సురక్షితమైన నీరుకలిపి ఇవ్వాలన్నారు. 2 నుండి 19 సంవత్సరాల వయస్సు వారికి 400 మి . గ్రా . ట్యాబ్లెట్ ఒక్కొక్కటి చొప్పున పంపిణీ చేసి వినియోగించేలా పర్యవేక్షణ చేయాలన్నారు .మాత్ర గొంతులో ఇరుక్కోకుండా ఉండేందుకు దానిని బాగా చప్పరించి శుభ్రమైన త్రాగునీటితో కలిపి మింగాలని తెలిపారు. ఆల్పెండజోల్ పిల్లలకు, పెద్దలకు సురక్షితమైన మాత్రని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు , ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు , కళాశాలల అధ్యాపకులు , ఆశా కార్యకర్తలు , వసతి గృహ సంక్షేమ అధికారులు పూర్తిగా భాగస్వామ్యులు అయ్యేలా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు . మాత్ర వేసుకొనని వారిని గుర్తించి ఈనెల 18వ తేదీన మాప్ ఆప్ రోజున వారికి ఇవ్వడం జరుగుతందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 22వ తేదీ సాయంత్రంలోపు సంబంధిత ఉపాధ్యాయులు పాఠశాల, కళాశాల, అంగన్ వాడీ రిపోర్టింగ్ పార్మెట్ ను ఎఎన్ఎం లకు అందజేయాలన్నారు. సమావేశంలో డియంహెచ్ డా . డి. ఆశా , వైద్య విధానపరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ డా. ఎవిఆర్. మోహన్, జెడ్పి సిఇఓ కె. రవికుమార్, ఐసిడిఎస్ పిడి పద్మావతి, సోషల్ వెల్ఫేర్ జె డి మధుసూదన రావు, మున్సిపల్ కమీషనరు ఎస్. వెంకటకృష్ణ, బిసి సంక్షేమాధికారి నాగరాణి, విద్యాశాఖ ఎడి అవదాని, ఐటిడిఎ డిప్యూటీ డిఎంహెచ్ ఓ రాజీవ్, పలువురు మున్సిపల్ కమీషనర్లు, తదితరులు పాల్గొన్నారు.