హిందీ వివాదం.. సుదీప్ కు పెరుగుతున్న మద్దతు !
1 min readపల్లెవెలుగువెబ్ : జాతీయ భాషపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్, కన్నడ నటుడు కిచ్చా సుదీప్ మధ్య ట్విటర్ వేదికగా రేగిన వివాదంపై రాజకీయ నేతలు కూడా స్పందిస్తున్నారు. కర్ణాటక బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సుదీప్‌నకు మద్దతుగా ఏకమవుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ గురువారం విలేకర్లతో మాట్లాడుతూ, భాషల వల్లే మన రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఉందని తెలిపారు. సుదీప్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనన్నారు. భాషల ఆధారంగానే రాష్ట్రాలు ఏర్పడ్డాయని, అందువల్ల ప్రాంతీయ భాషలు చాలా ముఖ్యమైనవని చెప్పారు. ప్రతి ఒక్కరూ సుదీప్ చెప్పిన మాటలను అర్థం చేసుకోవాలని, గౌరవించాలని చెప్పారు.
బీజేపీ మౌత్ పీస్
జెడీఎస్ నేత హెచ్‌డీ కుమార స్వామి ఇచ్చిన ట్వీట్లలో సుదీప్‌ను సమర్థించారు. హిందీ జాతీయ భాష కాదన్నారు. అజయ్ దేవ్‌గన్ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారన్నారు. బీజేపీ చెప్తున్న హిందీ జాతీయ వాదానికి మౌత్‌పీస్‌గా అజయ్ దేవ్‌గన్ వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీపై విరుచుకుపడుతూ, ఓ విత్తనాన్ని నాటారని, అది అంటువ్యాధిలా మారిందని, అది దేశాన్ని విభజిస్తోందని ఆరోపించారు. అది దేశ ఐకమత్యానికి ముప్పు అని హెచ్చరించారు.