హిందూపురం బాగా అభివృద్ధి చెందుతుంది..
1 min read
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
హిందూపురంలో 85వ వాసవి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి టి.జి భరత్
రెండున్నర కేజీల వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి
కర్నూలు, న్యూస్ నేడు: హిందూపురం నియోజకవర్గాన్ని తమ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేయనుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. హిందూపురంలో నిర్వహించిన 85వ వాసవి మాత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులతో కలిసి ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో రెండున్నర కేజీల బంగారంతో తయారుచేసిన వాసవి కన్యకా పరమేశ్వరి మాతా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి టి.జి భరత్ మాట్లాడారు. రెండున్నర కేజీల వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి బంగారు విగ్రహం రూ.3 కోట్లు ఖర్చు చేసి తయారు చేయడం చాలా సంతోషకరమన్నారు. విగ్రహం తయారుచేసేందుకు సహకరించిన దాతలందరినీ ఆయన అభినందించారు. ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీనేనని మంత్రి టి.జి భరత్ చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడుకు ఆర్యవైశ్యులంటే ప్రత్యేక అభిమానం అని చెప్పారు. వాసవి అమ్మవారి ఆత్మార్పణ రోజుని తమ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. ఆర్యవైశ్యులు కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ అండగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు ఎప్పుడూ ముందువరుసలోనే ఉంటారన్నారు. ప్రజలకు ఏదైనా ఆపద వస్తే సహాయం చేసేందుకు ఆర్యవైశ్యులు ముందుంటారన్నారు. సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఆర్యవైశ్యులు రాణించాలని మంత్రి చెప్పారు. ఆర్యవైశ్యులకు ఎలాంటి సహకారం కావాలన్నా తాను ముందుంటానని హామీ ఇచ్చారు. దివంగత నాయకుడు రోశయ్య తర్వాత ఆర్యవైశ్యులకు పెద్ద దిక్కుగా తన తండ్రి టి.జి వెంకటేష్ ఉన్నారన్నారు. తిరుపతిలో సీతమ్మవారి ట్రస్టు భూములను కాపాడేందుకు టి.జి వెంకటేష్ ఎంతో కృషి చేశారన్నారు. తమ కుటుంబంపై ప్రేమ చూపిస్తున్న ఆర్యవైశ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటికీ ఆర్యవైశ్యుల ఆశీర్వాదాలు తమపై ఉండాలని ఆయన వారిని కోరారు. ఇక ప్రతి ఒక్కరూ గోసేవ చేయాలని టి.జి భరత్ చెప్పారు. గోమాత దీవెనల వలనే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు.హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ఉండటం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. లేపాక్షికి సంబంధించిన భూముల సమస్య తీరి ఇక్కడకు భారీగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి టి.జి భరత్ తెలిపారు. బెంగుళూరు విమానాశ్రయానికి దగ్గరగా ఈ ప్రాంతం ఉందని, తమ కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున సహకారం అందివ్వడం వలన హిందూపురానికి పరిశ్రమలు తప్పకుండా వస్తాయన్నారు. కార్యక్రమంలో భాగంగా బంగారు విగ్రహం తయారుచేసేందుకు సహకరించిన దాతలను ఆయన సన్మానించారు. అనంతరం పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ, ఆర్యవైశ్య మహిళా మండలి రాష్ట్ర అధ్యక్షురాలు కొప్పారపు రజని, ఆర్యవైశ్య సంఘం సత్యసాయి జిల్లా అధ్యక్షుడు జె.పి.కె రాము, ఆర్యవైశ్య మహాసభ గౌరవ సలహాదారుడు పోతుల సురేష్, ఆర్యవైశ్య నాయకులు రామ్ కుమార్, సిరిగుప్ప వెంకటేష్, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.
