‘మా’ ఎన్నికలు వెంటనే జరపండి.. చిరంజీవి
1 min read
సినిమా డెస్క్: గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలపై తీవ్ర స్ఠాయిలో చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అగ్ర కథానాయకుడు చిరంజీవి తాజాగా స్పందించారు. మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరు పెదవి విప్పారు. ప్రస్తుతం ఉన్నది ఆపద్ధర్మ కార్యవర్గమేనని స్పష్టం చేస్తూ.. ’మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు. వెంటనే ఎన్నికలు జరపాలని.. ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని లేఖలో పేర్కొన్నారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతోందని, ‘మా’ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్న ఎవర్నీ ఉపేక్షించవద్దని చిరంజీవి లేఖలో కృష్ణంరాజును కోరారు. ఆయన సమస్యను త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు చిరంజీవి అభిప్రాయపడ్డారు.