PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాగునీటి రంగంలో  రాయలసీమ పట్ల వివక్ష ఇంకా ఎన్నాళ్ళు

1 min read

– రాయలసీమ సాగునీటి  హక్కుల అమలుకు ప్రజలు సంఘటితంగా గళం విప్పాలి

– బొజ్జా దశరథరామిరెడ్డి.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాయలసీమ సాగునీటి హక్కుల అమలు సాధనకై ప్రజలంతా సంఘటితం కావలసిన సమయం ఆసన్నమైందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో ప్రజలకు బహిరంగ లేఖను    ఆదివారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల అవసరాలను తీర్చడంలో పాలకులు ఎల్లప్పుడూ యదావిధిగా ప్రత్యేక శ్రద్ద కనపరస్తూనే ఉన్నారని, అందుకు ప్రస్తుత ఉదాహరణ మృగశిర కార్తి వచ్చీ రాగానే జల వనరుల శాఖ మంత్రి జూన్ 7, 2023 కృష్ణా డెల్టాకు నీళ్ళు విడుదల చేయడమే నిదర్శనమని ఆయన అన్నారు.అదే సందర్భంలో సామాజికంగా, అర్థికంగా వెనుకబడిన  రాయలసీమలో  వర్షాధారిత పంటలు వేసుకోండి …. కృష్ణా, తుంగభద్ర జలాలపై ఆశలు పెట్టుకోవద్దని అధికారులు ప్రకటించడంలో ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని,   సాగునీటి అంశాల్లో పరిస్తితులను బట్టి రాయలసీమ ఈ వివక్షను కొంచెం అటు, ఇటుగా నిత్యం అనుభవిస్తూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు కృష్ణా డెల్టా ప్రాంతంలో నీటి విడుదల, నీటి నిలుపుదల తేదీలను పాలకులు ప్రకటించి అక్కడి రైతాంగానికి సాగునీటి లభ్యతపై  భరోసాను  కలిగిస్తారనీ , మరొకవైపు నదిలో నీరు ఉంటే మీకు నీరిస్తాం అని ప్రకటించి ఏరోజు వరకు, ఏ పంటకు నీళ్ళిస్తారో తెలపకుండా రాయలసీమ రైతాంగానికి మానసిక ఆందోళనకు గురిచేయడం పరిపాటిగా మారిందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.ఈ సంవత్సరం శ్రీశైలం రిజర్వాయర్ కు 2017 tmc ల నీరు వచ్చినప్పటికీ రిజర్వాయర్ అంతా ఖాళీ చేసి రాయలసీమకు త్రాగడానికి నీరు అందకుండా చేసిన పాలకులు, కృష్ణా డెల్టా నారుమళ్ల కోసం పులిచింతల రిజర్వాయర్లో 34 టి ఎం సీ లు నీరు ఉంచామని జూన్ 7, 2023 న ప్రకటించిన రోజైనా రాయలసీమ ప్రజాప్రతినిధులలో చలనం రాకపోవడం బాధాకరమని ఆయన తెలిపారు.కృష్ణా, తుంగభద్ర నదులలో వరద ప్రవాహం మొదలు కాకున్నా, గతంలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా  కృష్ణా డెల్టాకు తరలించినట్లుగానే ఈ సంవత్సరం  కూడా తీసుకొని పోవచ్చునన్న ధీమాతో కృష్ణా డెల్టాకు నీటి విడుదలను సాగునీటి శాఖ మంత్రి చేసారని,  ఆ దీమాకు కారణం రాయలసీమ ప్రజాప్రతినిధుల నిర్వాకమే అని మరల మరల చెప్పాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు స్పందించడం లేదంటే వారికి  తమ ప్రాంత సాగునీటి సమస్యల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉందో అర్థమవుతుందని  ఆయన అన్నారు.కృష్ణా డెల్టా అవసరాలను తీర్చడానికి ప్రకాశం బ్యారేజి, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు కాకుండా నాలుగవ స్థిరీకరణ ప్రాజెక్టుగా పులిచింతల రిజర్వాయర్, ఐదవ స్థిరీకరణ ప్రాజెక్టు గా పట్టిసీమ, ఆరవ స్థిరీకరణ ప్రాజెక్టుగా పోలవరం సాధించుకున్నారు అక్కడి ప్రజా ప్రతినిధులు. కాని రాయలసీమ ప్రాజెక్టుల స్థిరీకరణకు గుండ్రేవుల రిజర్వాయర్, సిద్దేశ్వరం అలుగు, తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, వేదవతి ఎత్తిపోతల పథకాలు కోసం గొంతెత్తకపోగా, శ్రీశైలం కాళీ చేస్తున్నా  మన ప్రజాప్రతినిధులు మౌనంగా ఉండటం బాధాకరంగా ఉందని అన్నారు. రాయలసీమ ప్రజా ప్రతినిధులు శ్రీశైలం రిజర్వాయర్ లో 854 అడుగులకు నీరు చేరేంత వరకు దిగువకు నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయకుండా పాలకులపై ఒత్తిడి పెంచడానికి, రాయలసీమ సాగునీటి నిర్మాణాలపై పాలకులపై ఒత్తిడి తేవడానికి రాయలసీమ ప్రజానీకం సంఘటితమై  గళం విప్పాలని దశరథరామిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

About Author