దొంగనోట్లు ముద్రిస్తున్న భార్యాభర్తలు..!
1 min readపల్లెవెలుగు వెబ్: సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో దొంగ నోట్లు ముద్రించడానికి పూనుకున్నారు ఓ దంపతులు. దొంగ నోట్లు ముద్రించి చెలామణి చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ లో జరిగింది. వరంగల్ లోని కాశీబుగ్గ తిలక్ రోడ్ కి చెందిన వంగరి రమేష్, సరస్వతి దంపతులు వ్యాపారం నిర్వహించేవారు. రమేష్ చికెన్ సెంటర్ నిర్వహిస్తుండగా.. సరస్వతి ఫ్యాన్సి స్టోర్ నిర్వహిస్తుండేవారు. వ్యాపారంలో నష్టం రావడంతో ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చింది. వెంటనే యూట్యూబ్ లో ఫేక్ మనీ ముద్రించే విధానాన్ని తెలుసుకున్నారు. అందుకు అవసరమైన కలర్ ప్రింటర్, స్కానర్, కట్టర్, తదితర వస్తువులు కొన్నారు. మూడు నెలలుగా 2వేలు, 500, 200,100, 50,20,10 నోట్లు ముద్రించి దుకాణాల్లో చెలామణి చేశారు. వరంగల్ లో దొంగ నోట్ల చెలామణి ఎక్కువగా ఉందని ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కాశీబుగ్గ తిలక్ రోడ్ లోని రమేష్ ఇంటి మీద పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పది లక్షల విలువైన నకిలీ కరెన్సీని, కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లు, కట్టర్, స్కానర్ లను స్వాధీనం చేసుకున్నారు.