ఉపకులపతి, ఆచార్య మునగాల సూర్య కళావతి పల్లెవెలుగు వెబ్, కడప బ్యూరో : ఆధునిక భారతదేశం తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జీవితం ఆదర్శనీయమని ఉపకులపతి ఆచార్య సూర్య కళావతి అన్నారు. సాహితీవేత్త, సయ్యద్ నజీర్ అహ్మద్ రచించిన “ఫాతిమా షేక్ ” పుస్తకాన్ని” వి సి ఆచార్య సూర్య కళావతి కులసచివులు ఆచార్య డి.విజయరాఘవ ప్రసాద్, పీజీ కళాశాల ప్రధానాచార్యులు జి.సాంబశివారెడ్డి శనివారం విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య మునగాల సూర్య కళావతి మాట్లాడుతూ సంఘసంస్కర్త మహాత్మ జ్వోతిరావ్ పూలే, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయిపూలే వద్ద ఉపాధ్యాయురాలుగా పనిచేసిన ఫాతిమా భారతీయ విద్యావేత్త అని తెలిపారు. ఆమె ఫుల్స్ పాఠశాలలో దళిత పిల్లలకు విద్యను అందించారని, మహరాష్ట్ర లో అణగారిన వర్గాలలో విద్యా వ్యాప్తి కోసం కృషి చేశారన్నారు. బాలికలను పాఠశాలలకు పంపడానికి ఇష్టపడని తల్లిదండ్రులకు ఆమె కౌన్సెలింగ్ ఇచ్చి చదువు విలువ గురించి చెప్పి ఒప్పించే వారన్నారు. రచయిత ఫాతిమా షేక్ గురించి రాసిన ఈ పుస్తకం సమగ్రంగా, ఆదర్శనీయంగా ఉందని ఆచార్య డి.విజయరాఘవ ప్రసాద్ అన్నారు. అనంతరం ప్రధానాచార్యులు ఆచార్య జి సాంబశివారెడ్డి మాట్లాడుతూ సయ్యద్ నజీర్ అహ్మద్ దాదాపు 15 పుస్తకాలు రాశారన్నారు. తొలి ఆధునిక ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ పేరుతో పుస్తకం తేవడం చక్కటి ఆలోచన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపప్రధానాచార్యులు ఆచార్య ఎస్. రఘునాధరెడ్డి, ఆచార్య ఎం.వి.శంకర్, సంయుక్త ఆచార్యులు డాక్టర్ ఎ.మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు.