చైనా కన్నుపడితే.. కనుమరుగు కావాల్సిందే !
1 min readపల్లెవెలుగు వెబ్ : చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థను మించిపోతారనుకుంటే.. నిర్ధాక్షిణ్యంగా ఎంతటివారినైనా కనిపించకుండా చేస్తోంది. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా అదృశ్యం కావడం.. నిబంధనల పేరుతో ఆయన సంస్థలను తొక్కిపట్టడం, టన్సెంట్ లాంటి గేమింగ్ సంస్థను నిబంధనల పేరుతో వేధించడం ఇలా చెప్పుకుంటే పోతే .. చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థకు మించి ఎవరైనా ఎదుగుతున్నారంటే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పుడు చైనాలోని ప్రసిద్ధ నటి ఝావో వీ పై ప్రభుత్వం కత్తిగట్టింది. ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో లేకుండా చేయాలంటూ ఆదేశించింది. అలీబాబా కంపెనీల్లో ఆమెకు పెట్టుబడులు ఉండటం ప్రధాన కారణం కావొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్యలతో ఝావో ఫ్రాన్స్ పారిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఝావో వీటిని కొట్టిపారేసింది. తాను బీజింగ్ లోనే ఉన్నట్టు వెల్లడించింది.