PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవకాశాలు కల్పిస్తే మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోరు..

1 min read

లింగ వివక్ష లేని సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.

ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా తైక్వాండో మహిళ క్రీడాకారులను సన్మానించిన సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.

పల్లెవెలుగు వెబ్​ కర్నూలు: సమాజంలో అవకాశాలు కల్పిస్తే మహిళలు పురుషులకు ఏమాత్రం తీసుకొని విధంగా రాణిస్తారని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణమండపంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళ తైక్వాండో క్రీడాకారులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఏ రంగంలో అయినా మహిళలు పురుషులకు తీసిపోని విధంగా రాణించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సమాజంలో స్త్రీ, పురుషులు అనే వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు. అభివృద్ధి చెందిన దేశాలు అనే అమెరికా, చైనా లాంటి దేశాల్లో దేశ అధ్యక్ష పదవి ఇంతవరకు మహిళలకు దక్కలేదని, ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం లాంటి దేశాల్లో మహిళలకు అలాంటి అవకాశాలు దక్కిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మన దేశ దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమైన పరిపాలన అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమాజంలో ఇంకా స్త్రీల పట్ల వివక్ష ధోరణి ఉండడం దురదృష్టకరమని అన్నారు. పురుషులతో సమానంగా రాణించే అవకాశం ఉన్నప్పటికీ మహిళలకు ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లభించడం లేదన్నారు .మహిళలు ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవిలో రాణించడంతోపాటు క్రీడారంగంలోనూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్న విషయాన్ని ఆయన వివరించారు. మహిళలు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఆకాశమే హద్దుగా ఎదగాలన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తైక్వాండో లో శిక్షణ పొందుతున్న మహిళా క్రీడాకారులను సన్మానించడం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో బాలికలను ఉన్నత చదువులు చదివించాలని కోరారు. ఏ కుటుంబంలో అయితే మహిళ ఉన్నత స్థానంతో ఉంటుందో ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ముందుకు సాగుతుందని చెప్పారు .మహిళలను గౌరవించడం అనేది మన దేశంలోనే అత్యున్నతమైన సాంప్రదాయమని, దీనిని ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు. ఎక్కడైతే మహిళా గౌరవించబడుతుందో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని వివరించారు. సమాజంలో తల్లిగా, భార్యగా, సోదరిగా.. ఇలా ఏ స్థానంలో ఉన్న మహిళలు పోషించే పాత్ర అందరికీ ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో శిక్షకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author