ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలుకు పరిశ్రమలు తీసుకొస్తా.. టిజి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తిరుగుతానని హామీ ఇచ్చారు కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టీజీ భరత్. నగరంలోని 23వ వార్డులో సాయి, ముత్తు ఆధ్వర్యంలో భారీగా యువత టిడిపిలో చేరారు. టీజీ భరత్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు యువతకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో టీజీ భరత్ మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని అప్పుడు తన సత్తా ఏంటో చూపిస్తానన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కర్నూలుకు పరిశ్రమలు తీసుకురాకపోతే రాజకీయాలనే వదులుకుంటానని చెప్పారు. ఉద్యోగాల కోసం కర్నూలు ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల సమయంలో కుల మతాలు చూడొద్దని అభివృద్ధి ఎవరు చేశారో ఆలోచించి ఓటు వేయాలన్నారు. కంపెనీలు కర్నూలుకు తీసుకువచ్చే సామర్థ్యం తనకు ఉందన్నారు. తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువైపోయిందన్నారు. భవిష్యత్తు అంతా యువత చేతుల్లోనే ఉందన్నారు. అనంతరం పార్లమెంటు అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ప్రజలపై పన్నుల భారాలు పెరిగిపోయాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాసేవకే అంకితమైన టీజీ భరత్ ను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకుందాం అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షుడు గున్న మార్కు, నేతలు రామాంజనేయులు రవి పరమేష్, వినోద్, రమేష్, గణేశ్, భారీగా యువత పాల్గొన్నారు.