కుప్పం గెలిస్తే మంత్రి పదవి !
1 min readపల్లెవెలుగువెబ్: ఏపీ సీఎం జగన్ ఇవాళ కుప్పంలో నిర్వహించిన సభలో చేయూత పథకం నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ విపక్ష నేత, మాజీ సీఎం, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కుప్పంకు చంద్రబాబు ఎమ్మెల్యేనే అయినా నాన్ లోకల్ గా మారిపోయారని, హైదరాబాద్ కు లోకల్ అయ్యారని ఎద్దేవా చేశారు. కుప్పం బీసీల సీటు అని, ఇక్కడ అత్యధికంగా ఉన్నది బీసీలేనని సీఎం జగన్ వెల్లడించారు. అలాంటప్పుడు బీసీలకు ఈ సీటును ఇవ్వకుండా లాక్కున్న పెద్దమనిషి సామాజిక న్యాయం గురించి మాట్లాడడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. 36 ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ సీటును టీడీపీ బీసీలకు ఇవ్వలేదని ఆరోపించారు. ఇది బాబు మార్కు సామాజిక న్యాయం అని విమర్శించారు. ఇక ఆయన చేసే మోసాలు భరించేది లేదని, ఇక తలవొగ్గేది లేదని కుప్పం ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీగా ఉన్న భరత్ తనతో ఇన్ని అభివృద్ధి పనులు చేయిస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో కుప్పంలో భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని సీఎం జగన్ సభాముఖంగా ప్రకటించారు. కుప్పం నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గంగా భావిస్తానని స్పష్టం చేశారు.