పెన్షన్ ఆలస్యమైతే రూ. 100 జరిమానా !
1 min readపల్లెవెలుగువెబ్ : వైఎస్సార్ పెన్షన్ కానుక కింద అందజేసే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ తర్వాత మిగులు నిధుల్ని ప్రభుత్వ ఖాతాకు తిరిగి జమచేస్తుంటారు. అయితే, వీటిని జమ చేయడంలో జాప్యం జరుగుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మిగుల నిధులు జమచేయడంలో జాప్యం చేయొద్దని గతంలోనే ప్రభుత్వం ఆదేశాలిచ్చినా పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. దీంతో పక్కాగా అమలుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో/ మున్సిపల్ కమిషనర్లను గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) తాజాగా ఆదేశాలు వెలువరించింది. పంపిణీ పూర్తయిన తర్వాత మిగిలిన మొత్తాన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లోని సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులు ప్రభుత్వ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో సకాలంలో వీటిన జమ చేయడంలేదని ప్రభుత్వం గుర్తించింది. దీంతో పింఛను పంపిణీ పూర్తయిన తర్వాత రెండు రోజుల్లో (బ్యాంకు పనిదినాలు) మిగులు నిధులను జమ చేయకపోతే రోజుకు రూ.100 చొప్పున అపరాధ రుసుము వసూలు చేయాలని సెర్ప్ ఆదేశాలిచ్చింది. అంతేకాదు, 10 రోజులకు మించి ఆలస్యమైతే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.