ఏఎన్ఎం ల పై పనిభారం తగ్గించకపోతే.. ఉద్యమమే…: సీఐటీయూ
1 min readపల్లెవెలుగు కడప /రాయచోటి : రాష్ట్రవ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ పేరుతో వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఏఎన్ఎంలపై పని భారం పెరిగిందని, వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని వెంటనే పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎ. రామమోహన్, సీఐటీయూ కడప జిల్లా కార్యదర్శి అబ్బవరం రామాంజులు. ఆదివారం కడప నగరంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో 1200 మంది ఏఎన్ఎంలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారని, కానీ ఏఎన్ఎంలను పనిభారంతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాయచోటి మున్సిపల్ కమిషనర్ రాత్రి 9:30 గంటల తర్వాత కూడా వాక్షిన్ వేసేలా ఒత్తిడి తీసుకువస్తున్నారని, వ్యాక్సినేషన్ కేటాయింపు కూడా జనాభాకు అనుగుణంగా ఉండటం లేదన్నారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు వాక్షిన్ కొనసాగించేలా చేయటం సమంజసం కాదని వారన్నారు. వ్యాక్సిన్ వేసేందుకు ఏఎన్ఎంలు సిద్ధంగా ఉన్నారని , కానీ ప్రజలు ఆ మేరకు సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని ఏఎన్ ఎం ల పై పనిభారం తగ్గించేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.