ఒక్క పెగ్గు తాగినా.. ప్రమాదమే !
1 min readపల్లెవెలుగు వెబ్ : అప్పుడప్పుడు ఒక పెగ్గు మందు తాగితే ప్రమాదమేమి కాదని చాలా మంది భావిస్తారు. పైగా ఆరోగ్యానికి కూడ మంచిదని కొందరు చెబుతుంటారు. అయితే.. ఇవన్నీ అబద్ధమని తేల్చేశారు పరిశోధకులు. ఒక పెగ్గు తాగినా.. రెండు తాగినా ప్రమాదం ఒకటేనని.. పెగ్గు పెరిగే కొద్దీ ప్రమాదం కూడ పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కాలీఫీర్నియా యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. వీరి లెక్క ప్రకారం ఒక పెగ్గు తీసుకున్నా గుండె కొట్టుకోవడంలో తేడాలొచ్చే ప్రమాదం ఎక్కువ. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఉంటే.. దీనిని ఆట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కూడ అవుతుంది. ఈ సమస్య తాగుబోతుల్లో ఎక్కువ అని ఓ అంచనా ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క పెగ్గు తీసుకున్నా సరే ప్రమాదం ఎక్కువయ్యే అవకాశం ఉందని తాజా పరిశోధనలకు నేతృత్వం వహించిన గ్రెగరీ మార్కస్ చెబుతున్నారు.