గూగుల్ చూసి మందులిస్తే.. తీవ్రమైన కిడ్నీ సమస్య
1 min read* కుమార్తెకు అతిగా యాంటీబయాటిక్స్ ఇచ్చిన తండ్రి
* వాటివల్ల కిడ్నీలలో పదే పదే రాళ్లు, మాట్రిక్స్, ఇన్ఫెక్షన్
* ఆపరేషన్ చేసి సమస్య తగ్గించిన ఏఐఎన్‌యూ వైద్యులు
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: తనకు ఏదో సమస్య ఉందని చెప్పగానే బహుశా అది ఫలానా సమస్య అయి ఉండొచ్చని అన్న ఓ తండ్రి.. తన కుమార్తెకు గూగుల్ పరిజ్ఞానంతో తెలిసీ తెలియకుండా అతిగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, అది కూడా కోర్సు పూర్తిగా కాకుండా రెండు మూడు వాడేసి ఆపేయడం వల్ల ఆమెకు ప్రాణాల మీదకు వచ్చింది. ఆ యువతికి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో పాటు మూత్రపిండాల్లో మాట్రిక్స్ (ప్రోటీన్లు గట్టిబడిపోవడం వల్ల ఏర్పడే రాళ్లలాంటివి) ఏర్పడి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సికింద్రాబాద్ విక్రంపురి కాలనీలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు ఆమెకు విజయవంతంగా చికిత్స చేసి నయం చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏఐఎన్‌యూకు చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ రాఘవేంద్ర కులకర్ణి తెలిపారు. “ఆర్కిటెక్టుగా పనిచేసే ఆ యువతికి గతంలో ఒకసారి కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు వేరే ప్రైవేటు ఆస్పత్రిలో చూపించగా, వాటిని తీయడం కుదరదని చెప్పారు. దాంతో ఏఐఎన్‌యూకు రాగా, ఆమెకు ముందుగా సీటీస్కాన్ చేసి చూశారు. అందులో 10-13 మి.మీ. పరిమాణంలోని కొన్ని రాళ్లు ఉన్నాయి. అవి మూత్రపిండానికి, మూత్రనాళానికి మధ్యలో ఉన్నాయి. మొత్తం 8 రాళ్లుండగా, వాటిలో రెండే మామూలు రాళ్లు. మిగిలిన ఆరు మాట్రిక్స్ స్టోన్స్. ఏడాదిన్నర క్రితం ఆమె కిడ్నీలో రాళ్లు ఉన్నాయని శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే అప్పుడు కొన్నిమాత్రమే తొలగించి, మిగిలినవి వదిలేశారు. ఆ తర్వాత ఆమెకు పదే పదే జ్వరం వస్తూ, మూత్రద్వారం వద్ద మంటగా అనిపించేది. అయినా వైద్యులను సంప్రదించలేదు. వైద్యరంగంతో ఏమాత్రం సంబంధం లేని తన తండ్రి చెప్పడంతో యాంటీబయాటిక్స్ వాడేవారు. అది కూడా ఒకటి రెండు మాత్రమే వేసుకుని, ఆపేసేవారు. ఇలా ఏళ్ల తరబడి అరకొరగా యాంటీబయాటిక్స్ ఉపయోగించారు. దీనివల్ల శరీరంలోని బ్యాక్టీరియా మొండిగా మారిపోయి, దానివల్ల ప్రోటీన్లన్నీ గట్టిబడి, అవి మాట్రిక్స్‌గా అవుతాయి. ఇటీవల ఆమెకు మళ్లీ జ్వరం రావడం, సమస్య ఎక్కువగా ఉందనిపించడంతో ఆస్పత్రికి వచ్చారు. కిడ్నీ బ్లాక్ కావడం, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ రావడంతో సమస్య వచ్చిందని గుర్తించాం. దాంతో ముందుగా ఆమెకు బయటి నుంచి క్యాథెటర్ అమర్చి, దాన్నుంచి ఇన్ఫెక్ట్ అయిన మూత్రాన్ని బయటకు పంపించాం. తర్వాత రెండో సర్జరీలో రాళ్లు తీయడానికి ప్రయత్నించాం. అందులో రెండు మాత్రమే రాళ్లు మిగిలిన ఆరూ మాట్రిక్స్. శస్త్రచికిత్స తర్వాత ఆమెతో మాట్లాడితే, తనకు మూత్రనాళ ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్-యూటీఐ) ఉందనిపించిన ప్రతిసారీ యాంటీబయాటిక్స్ వాడేదాన్నని చెప్పారు. తగిన మోతాదులో వాడకుండా సగంలో మానేయడం వల్ల ఆమెకు ఒక పట్టాన మందులకు లొంగని బ్యాక్టీరియా ఏర్పడింది. ఇలాంటి కేసుల్లో తప్పనిసరిగా మరింత బలమైన యాంటీబయాటిక్స్ కోర్సు ప్రకారం వాడాల్సి వస్తుంది. దానికితోడు ఈ ఇన్ఫెక్షన్ కారణంగానే మాట్రిక్స్ ఏర్పడి పదే పదే ఇబ్బంది తలెత్తుతుంది. అందువల్ల వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు. అవి కూడా పూర్తి కోర్సు వాడాలి తప్ప సగంలో మానేయకూడదు. ఈ మాట్రిక్స్ స్టోన్స్ మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి, వీటిని తొలగించడానికి పీసీఎన్ఎల్ సరైన చికిత్స” అని డాక్టర్ రాఘవేంద్ర కులకర్ణి వివరించారు.ఆరోగ్యం విషయంలో తెలిసీ తెలియక తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే సమస్యలు ఈ కేసుతో అర్థమవుతాయి. ఇలాంటి సంక్లిష్టమైన కేసులకు చికిత్స చేయడానికి అవసరమైన నిపుణులు ఏఐఎన్‌యూలో ఉన్నారు. బాధ్యతాయుతమైన వైద్యం చేస్తూ, ఆరోగ్యంగా ఉండాలంటే సరైన వైద్యుల సలహా తీసుకోవాల్సిన ప్రాధాన్యాన్ని కూడా ఇక్కడ వివరిస్తారు. ఏఐఎన్‌యూ గురించి: ద ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) అనేది ప్రధానంగా నెఫ్రాలజీ, యూరాలజీ రంగాల్లో ప్రత్యేక చికిత్సలు అందించే ప్రధాన ఆస్పత్రి. అత్యాధునిక చికిత్సలు అందిస్తూ, సంక్లిష్టమైన కేసులను పరిష్కరిస్తూ, బాధ్యాతాయుతమైన వైద్య విధానాల గురించి అవగాహనను పెంపొందిస్తుంది.