NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తప్పు చేస్తే వాలంటీర్ల పై ఇక వేటే

1 min read

– ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసిన సచివాలయాలశాఖ
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే గ్రామ, వార్డు వాలంటీర్లపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిపై వచ్చే ఫిర్యాదులపై గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, నగరాలు, పట్టణాల్లో వార్డు పరిపాలన కార్యదర్శులు విచారించనున్నారు. వాలంటీర్లపై చర్యలు తీసుకునే అధికారం మండల పరిషత్‌ అభివృద్ధికారి (ఎంపీడీవో), పుర, నగరపాలక కమిషనర్లకు కల్పించారు. ఇందుకు సంబంధించి సచివాలయాలశాఖ సోమవారం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. నెలకు రూ.5 వేల గౌరవ వేతనంపై ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వాలంటీర్లను నియమించింది. వీరిలో తప్పు చేసే వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఇప్పటివరకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు లేవు. తొలగించే విషయంలో స్పష్టత లేకపోవడంతో పరిపాలన, న్యాయపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో సచివాలయాలశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ ప్రకారం అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రజల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం, అనైతికత, అక్రమాలు వంటి అభియోగాలపై వచ్చే ఫిర్యాదులపై కార్యదర్శులు విచారించి తదుపరి చర్యల కోసం ఎంపీడీవో, పుర కమిషనర్లకు సిఫార్సు చేస్తారు. తమపై అకారణంగా చర్యలు తీసుకున్నారని వాలంటీర్లు భావించినట్లయితే అలాంటి వారంతా 15 రోజుల్లోగా రెవెన్యూ డివిజినల్‌ అధికారి (ఆర్డీవో) ఛైర్మన్‌గా ఏర్పడిన డివిజనల్‌ కమిటీ ముందు అప్పీల్‌ చేసుకోవచ్చు.

About Author