పదిరోజులైనా పగిలిన నర్సప్ప కొండను పట్టించుకోరా
1 min read– దళితుల ప్రాణాలంటే లెక్కలేదా
– సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండల కేంద్రం లోని ఎస్సీ కాలనిలో పగిలిన కొండ సమస్యను ఇంకెన్నాలకు పరిష్కరిస్తారని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు విమర్శించారు. మంగళవారం సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం డి ఆనంద్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు బి కరుణాకర్, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల మండల బాధ్యులు నరసింహులు, దేవేంద్ర, సిఐటియు నాయకులు బతకన్న, మునెప్ప లతో కలిసి పగిలిన కొండను పరిశీలించడంతోపాటు చుట్టూ పక్కల ఉన్న బాధిత కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన ఎండ తీవ్రత కారణంగా అర్ధాంతరంగా కొండ పగిలిపోయిందన్నారు. గతంలో అధికారుల అలసత్వం కారణంగానే నర్సప్ప కొండకు చుట్టూరా ఉన్న అర ఎకరంలోని కొండలను ఎలాంటి అనుమతులు లేకపోయినా సంపూర్ణంగా తీసేసారన్నారు. అటాచ్ లేకపోవడం, ఎండ తీవ్రత పెరగడంతో నర్సప్పకొండ అర్ధాంతరంగా పగిలిపోయిందన్నారు. కొండపగిలాక పాలకులు, అధికారులు చూసిపోవడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. కొండ పక్కనున్న రోజు వారి కూలి కష్టం పై ఆధారపడి పనిచేసే దళితులకు ఒక పూట భోజనం పెట్టి, స్కూల్లో పడుకోండని చెప్పి చేతులు దులుపుకున్నారన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, ఘటన ప్రాంతాన్ని వెంటనే పరిశీలించడంతోపాటు, పెద్ద ప్రోక్లైన్ల సహకారంతో కొండను సంపూర్ణంగా తీసివేసి, దళితుల ప్రాణాలకు రక్షణ కల్పించాలన్నారు. లేనిచో దళితులందరినీ కూడ కట్టి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.