ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారి పైన అక్రమ కేసులు
1 min read– ప్రజాస్వామ్య విలువలను కాపాడండి
– పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి క్రాంతి నాయుడు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో ప్రధాని మోడీ విఫలమయ్యారని, పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీపై కేసుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు గారి ఆదేశాల మేరకు పత్తికొండ నియోజకవర్గ నాలుగు స్థంబాల కూడలి, మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట సత్యాగ్రహ దీక్ష కు మద్దతుగా సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి క్రాంతి నాయుడు మాట్లాడుతూ రాహుల్ గాంధీ పై పరువునష్టం దావా వేయడం విడ్డూరంగా ఉందని, బ్యాంకులను దగా చేస్తున్న వారిని పక్కకు పెట్టి, రాహుల్ గాంధీ పై కేసులు బనాయించి అవమానం పాలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. జాతి ఐక్యత కోసం రాహుల్ గాంధీ జోడో యాత్ర నిర్వహించడం గర్వకారణం అన్నారు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు యాత్ర చేసి దేశ ఔనిత్యాన్ని ప్రపంచానికి చాటారు అని, చిదిలమైన రాష్ట్రాలను ఐక్యం చేయుటకు ప్రయత్నం చేస్తున్నారు అని ఆయనకు వస్తున్న మద్దతు చూసే మోడీ, బీజేపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ భారతదేశంలో ప్రధానిగా పాలించే హక్కు మోడీకి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని ఆయన అభివర్ణించారు. ఈ చర్య ప్రధాని నరేంద్ర మోడీ దురంకారం నియంతృత్వానికి పరాకాష్ట అని ఆయన తెలిపారు. రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తన హేయ మైన చర్యల కోసం మోడీ ప్రభుత్వం వినియోగించుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చెడు కాలం దాపరించిందన్నారు. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయిందని , నేరస్తులు దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై వేటువేసి మోదీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారన్నారు. బిజెపి దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. మోడీ ఇంటి పేరు గలవారు అందరూ దొంగలేనంటూ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలులో ఎటువంటి తప్పు లేదన్నారు. సుమారు 27 మంది జాతీయవాద వ్యాపారవేత్తలు బ్యాంకులను లూటీ చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేయడం తప్పు అని చెప్పే కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను దివాలా దిశగా తీసుకెళుతున్న బడా వ్యాపారవేత్తలకు ఎందుకు రుణమాఫీ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పై నిర్ణయం తొందరపాటు చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా రాహుల్ పై అనర్హత వేటు వేశారని పదేపదే తనకు కుటుంబం లేదని చెప్పి దేశ ప్రజలను మోడీ నమ్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీ దేశ సంపదను తన స్నేహితులకు కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. ఆదాని అంశంపై లోక్ సభలో మోదీని రాహుల్ నిలదీశారని రాహుల్ అడిగిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదన్నారు. న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడంలో మోడీకి మించిన నాయకులు లేరన్నారు. ప్రజల కోసం పోరాడే నాయకులపై కేసులు పెట్టారని గుజరాత్ అల్లర్ల సందర్భంగా ప్రజలను కుక్కలతో పోల్చారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవడంలో కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు . దేశ జెండాలో వారి కుటుంబ రక్తం ఉందని, దేశ ప్రజల కోసం వారీ కుటుంబం రక్తం ధార పోసిందన్నారు. బిజెపి ఎన్ని కుట్రలు చేసినా దేశ ప్రజలు నమ్మరని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, నేరగాళ్లకు శిక్షలు పడాలని చెప్పడంలో తప్పు ఏముందని ఆయన ప్రశ్నించారు. 14 మంది ప్రధానులు చేసిన అప్పులు సుమారు 56 లక్షల కోట్ల రూపాయలు అయితే ఒక్క మోడీ చేసిన పాలనలో 100 లక్షల కోట్లు అప్పులు చేయడం ఎవరిని ఉద్ధరించాయన్నారు. కేవలం మోడీ భజన పరులను ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నించడం మినహా చేసింది ఏమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన మోడీ కుంటు సాకులు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయలేదా అని ఆయన ప్రశ్నించారు . వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని చెప్పి వెనుకడుగు వేయలేదా అని ఆయన ప్రశ్నించారు. స్కాములు హత్యలు మానభంగాలు చేసిన వారిపై న్యాయస్థానాలలో కేసులు నిలబడటం లేదని, దొంగల ఇంటి పేర్లు మోడీ అని ఎందుకు ఉంటున్నాయో అని ప్రశ్నించినందుకు శిక్ష వేయించడం అనర్వత వేటు వేయడం సిగ్గుచేటు అన్నారు . దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ముఖ్యమంత్రులు మద్దతు ఇస్తుంటే , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం మౌనంగా ఉండటం ఎంతవరకు సమంజసం ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో మోడీ తన వృత్తికి దగ్గర కాక తప్పదు అన్నారు.