విలేకరులపై అక్రమ కేసులు అన్యాయం…
1 min read– అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి
– కాశీభట్ల సాయినాథ్ శర్మ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో ఇసుక అక్రమ రవాణా ఫిర్యాదులపై వార్తా సేకరణకు వెళ్లిన తొమ్మిది మంది విలేకరులపై జె.పి సంస్థ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేయడం అక్రమం, అన్యాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి తెలుగు నాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు.గురువారం ఆయన మాట్లాడుతూ వేంపల్లి మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలపై వైసీపీ సర్పంచ్ బాహాటంగా విలేకరులకు సమాచారం ఇచ్చారన్నారు.ఇసుక దోపిడీ అక్రమమా సక్రమమా అనే విషయంపై వార్తా సేకరణకు వెళ్లిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులపై కక్షపూరితంగా జే.పీ సంస్థ ఫిర్యాదు చేయడం పోలీసులు కేసు నమోదు చేయడం చాలా విడ్డూరమన్నారు.భారత రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్ గా మీడియా రంగం ఎంతో ఉన్నత స్థానంలో ఉందన్నారు.మీడియాకు ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ ఉందని అయితే కొన్ని స్వార్థపూరిత శక్తులు మీడియాను తమ స్వలాభాలకు వాడుకుంటూ కొన్నిచోట్ల తొక్కి వేస్తున్నారన్నారు.మీడియా ప్రతినిధులపై తప్పుడు కేసులు బనాయించడం రాజ్యాంగ వ్యవస్థకే వ్యతిరేకమన్నారు జేపీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేయకుండా కేసు నమోదు చేయడం అక్రమ రవాణాకు పరిపాలన వ్యవస్థలు ఎలా అండగా నిలుస్తున్నాయో అర్థమవుతోందన్నారు. వేంపల్లె మీడియా ప్రతినిధులపై నమోదు చేసిన తప్పుడు కేసులను తక్షణమే పోలీసులు ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.