ఆక్వా చెరువులు అక్రమ త్రవ్వకాలు ఆపాలి
1 min read– ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామంలో అక్రమంగా ఆక్వా చెరువుల త్రవ్వకాలు ఆపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమంలో ఏలూరు ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరంస్థానిక పవర్ పేటలోని అన్నే భవనంలో అక్రమ ఆక్వా చెరువులు త్రవ్వకాలపై జరిగిన సమావేశంలో కె.శ్రీనివాస్ మాట్లాడారు. ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామంలో 500 ఎకరాల వరకు వరి పండే సారవంతమైన భూములు ఉన్నాయని ఆ భూమిలే ఆ గ్రామంలోని కౌలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు జీవనాధారమన్నారు. గ్రామంలోని భూస్వాములు సారవంతమైన వ్యవసాయ భూములను ఆక్వా చెరువులుగా త్రవ్వేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అక్రమంగా తవ్విన ఆక్వా చెరువులను ధ్వంసం చేయాలని, ఇకనుండి చెరువుల త్రవ్వకాలు అనుమతులు ఇవ్వవద్దని కోరారు. గ్రామంలో ఉన్నతాధికారులు పర్యటించి వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు భరోసా ఇవ్వాలని కోరారు. ఆక్వా కాలుష్యం వలన పంటల పండే వరి భూములు చౌడు బారిపోతున్నాయని ఆందోళన చేశారు. ఉపాధి లేక వ్యవసాయ కార్మికులు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా చెరువు తవ్వకాలు ఆపకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఉల్లంకి నాంచారయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిహెచ్. మాధవరావు తదితరులు పాల్గొన్నారు.