పాత పెన్షన్ అమలు చేసే వారికే మా ఓటు – యుటిఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం మాత్రమే అమలు చేయాలని,పాత పెన్షన్ విధానం తప్ప ఏ విధానం ప్రత్యామ్నాయం కాదని యుటిఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి పేర్కొన్నారు. స్థానిక యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో యుటిఎఫ్ ప్యాపిలి మండల శాఖ అధ్యక్షులు కృష్ణా నాయక్ అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సి పి యస్ విధానాన్ని రద్దు చేస్తామని మాట ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. యుటిఎఫ్ మరియు మిగిలిన ఉపాధ్యాయ సంఘాలు సి పి యస్ విధానాన్ని రద్దు చేయాలని ఎన్నో పోరాటాలు చేస్తే సి పి యస్ స్థానంలో అత్యంత దుర్మార్గమైన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని తీసుకొని రావడమే కాకుండా రాష్ట్ర శాసనసభలో జి పి యస్ చట్టాన్ని ఆమోదింపచేయడమనేది 3 లక్షల మంది ఉద్యోగ,ఉపాధ్యాయుల గొంతు కోయడమే అని వాపోయారు. ఈ సమావేశంలో మండల సీనియర్ నాయకులు బొజ్జన్న,చంద్ర మోహన్,అంజనప్ప,సర్వజ్ఞ మూర్తి,సహాధ్యక్షులు రమేష్ నాయుడు,ఆర్థిక కార్యదర్శి మధు,మండల కార్యదర్శులు రాజ శేఖర్,కంబగిరి,ఖాదర్ వలి తదితరులు పాల్గొన్నారు.