PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

36 గంటల్లో.. పసికందు కిడ్నాప్​ కేసు ఛేదన

1 min read

– ఆదోని టూటౌన్​ పోలీసులు, డీఎస్పీని అభినందించిన ఎస్పీ
– చిన్నారికి ‘ దిశ’గా నామకరణం
– ఎస్పీని అభినందించిన డీజీపీ గౌతమ్​ సవాంగ్​
పల్లెవెలుగు వెబ్​, ఆదోని : జిల్లాలో సంచలనం రేపిన ఆడశిశువు కిడ్నాప్​ కేసును ఆదోని పోలీసులు, డీఎస్పీ 36 గంటల్లో ఛేదించారు. రక్షించిన ఆడ బిడ్డకు ‘ దిశ’గా నామకరణం చేశారు ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఎస్​కేడీ కాలనీలోని వంశీ చైతన్య హాస్పిటల్​లో ఆదోని మండలం అలసందగుత్తికి చెందిన పూజారి రేణుకమ్మ ఈ నెల 2వ తేదీ ( బుధవారం) ఆడశిశువుకు జన్మనించింది. మరుసటి రోజు భర్త పూజారి, అత్త లక్ష్మమ్మ హాస్పిటల్​ వద్ద ఉన్నప్పుడు ఓ గుర్తు తెలియని మహిళ బురఖా వేసుకు వచ్చి రేణుకమ్మ అంటే మీరేనా.. అని అడిగి.. మీ పాపకు ప్రభుత్వ ఆస్పత్రిలో అమ్మ సూది వేయాలని వైద్యులు పంపారని చెప్పింది. ఆటోలో ఆస్పత్రి దగ్గరకు వెళ్లగానే.. మాతాశిశు సంరక్షణ కార్డు, ఆధార్​ కార్డు జిరాక్స్​ తీసుకు రమ్మని గుర్తు తెలియని మహిళ చెప్పడంతో రేణుకమ్మ అత్త లక్ష్మమ్మ వెళ్లింది. జిరాక్స్​ తీసుకుని వచ్చిన వెంటనే సదరు మహిళ ఆస్పత్రి వద్ద లేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో విచారించినా ఫలితం లేకపోవడంతో పూజారి శ్రీనివాసులు టూటౌన్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు వెంటనే వాహనాలను తనిఖీ చేశారు. ఆదోని టౌన్ లోని C.C. T.V. Footages సేకరించి వాటి ఆధారంగా ముద్దాయి ప్రయాణించిన ఆటోను కనిపెట్టి, ఆటో ప్రయాణించిన మార్గంలోని సెల్ టవర్ ల నుండి, మరియు వంశీ చైతన్య ఆసుపత్రి, ఆధిత్య నర్సింగ్ హోమ్ వద్ద గల సెల్ టవర్ ల నుండి టవర్ డంపు తీసుకొని, అనుమానిత వ్యక్తుల సెల్ నెంబర్ లను సేకరించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనుమానితుల కింద కనకుర్తి షేర్​ ఝాన్సీ లక్ష్మి (మండిగిరి), కనకుర్తి షేర్​ మంజునాథ ( ఎస్​కేడీ కాలనీ), వశ్య యశోధ ( క్రాంతినగర్​)ను విచారించారు. షేర్​ ఝాన్సీ లక్ష్మి దగ్గర ఆడ బిడ్డ ఉన్నట్లు గుర్తించిన టూటౌన్​ పోలీసులు పాపను ఎస్పీ ఫక్కీరప్ప చేతుల మీదుగా శిశువు తల్లిదండ్రులకు అప్పగించారు.

‘ దిశ’గా నామకరణం: జన్మించిన మొదటి రోజే కిడ్నాప్​కు గురై… పోలీసులను పరుగులు పెట్టించిన ఆడ శిశువుకు జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప ‘ దిశ’గా నామకరణం చేశారు. అనంతరం ఎస్పీ పాప తల్లిదండ్రలకు అప్పగించారు. ఆదోని ఆర్ట్స్​ అండ్​ సైన్స్​ కళాశాల జూబ్లీహాల్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడారు. కేసును 36 గంటల్లో ఛేదించిన టూటౌన్​ పోలీసులు, ఆ దోని డీఎస్పీ వినోద్​ కుమార్​ను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఆదోని ఒన్​టౌన్​ సీఐ చంద్రశేఖర్​, టూటౌన్​ సీఐ శ్రీరాములు, త్రీ టౌన్​ సీఐ నరేష్​ బాబు, ట్రాఫిక్​ సీఐ లక్ష్మయ్య, రూరల్​ సీఐ శ్రీ పార్థ సారధి, ఎమ్మిగనూరు సీఐ శ్రీనివాసులు నాయక్​, రూరల్​ సీఐ మంజునాథ్​, మంత్రాలయం సీఐ కృష్ణయ్య, ఆలూరు సీఐ ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు.

About Author