బీఎస్సీ నర్సింగ్ పాఠ్యాంశంలో.. వరకట్నం వల్ల ప్రయోజనాలు.. !
1 min readపల్లెవెలుగువెబ్ : వరకట్నం సామాజిక నేరం అంటూ ఎంతో మంది సామాజిక ఉద్యమకారులు ఉద్యమిస్తున్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులకు వరకట్నం భారంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వరకట్నాన్ని సమర్థిస్తూ ఓ పేరాను బీఎస్సీ నర్సింగ్ పుస్తకాల్లో పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. టీకే ఇంద్రాణి రచించిన సోషియాలజీ ఫర్ నర్సింగ్ పుస్తకంలోని ఒక పేరాలో వరకట్నాన్ని సమర్థిస్తూ ఆమె వ్యాఖ్యలు చేశారు. అందవిహీన అమ్మాయిలకు మంచి అబ్బాయిలతో పెళ్లి కావాలంటే కట్నం ముట్టజెప్పాల్సిందే అంటూ ఆమె పేర్కొనడం తీవ్ర వివాదానికి కారణమైంది. అలాగే కట్నాలు ఇచ్చే స్తోమత లేకే కొందరు తల్లిదండ్రులు తమ కూతుర్లను ఉన్నత చదువులు చదివిస్తున్నారని, వారు చదివి, ఉద్యోగం సంపాదిస్తే కట్నం డిమాండ్ తగ్గుతుందని రాశారు. వేరే ఇంట్లోకి కొత్త కుటుంబసభ్యురాలిగా అడుగుపెట్టి వారి గౌరవం పొందేందుకు వరకట్నం ఎంతగానో సాయపడుతుందన్నారు. తన తల్లిదండ్రుల ఆస్తిలో భాగాన్ని అమ్మాయిలు కట్నం రూపంలో అత్తవారింటికి తెచ్చుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పేరా ఉన్న పేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. ఇలాంటి పాఠ్యపుస్తకాలు ఉండటం మన భారతజాతికే సిగ్గుచేటు
అంటూ శివసేన మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.