PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్యాక్షన్​ ట్రెండ్ మారిందా?

1 min read
  • ఫ్యాక్షన్​ గడ్డలో.. ఒక్కట‌వుతున్న ప్రత్యర్థులు
    -నిజంగానే మారిపోయారా?
    -కార్యక‌ర్తలు ఏక‌మ‌వుతారా?
    ప‌ల్లెవెలుగు వెబ్: ఒక‌ప్పటి ఫ్యాక్షన్ గ‌డ్డలో రాజీ సూత్రాలు వ‌ల్లిస్తున్నారు. విభేదాలు మాని.. క‌ల‌సి ప‌నిచేస్తామంటున్నారు. నేత‌లు క‌లిసిపోయారు. మ‌రి క్యాడ‌ర్ సంగ‌తేంటి?. రాజీ ఫార్ములాకు కిందిస్థాయి కేడ‌ర్ ఒప్పుకుంటుందా. నేత‌ల విబేధాలు స‌మ‌సినంత సులువుగా కేడ‌ర్ మ‌ధ్య విబేధాలు త‌గ్గిపోతాయా అన్నది అస‌లు ప్రశ్న. జ‌మ్మల‌మ‌డుగు వైసీపీలో ఇప్పుడు అదే ప్రశ్న అంద‌రి మెదుళ్లను తొల‌చివేస్తోంది. మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి రావ‌డంతో మొద‌లైన స‌మ‌స్య.. అధిష్టానం వ‌ర‌కు వెళ్లింది. స్వయంగా సీఎం రంగంలోకి దిగాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. ఎట్టకేల‌కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని, మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డిని ఒక్కటి చేశారు. ఎంపీ అవినాశ్ రెడ్డి స‌మ‌క్షంలో ఆ ఇద్దరు నేత‌లు ఒక్కట‌య్యారు. సిట్టింగ్ స్థానం సుధీర్ రెడ్డికే అని క‌న్ ఫ‌ర్మ్ చేశారు. రామ‌సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీనో.. లేదా..నియోజ‌వ‌క‌ర్గ పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే ఎమ్మెల్యే సీటు ఇస్తామ‌ని జ‌గ‌న్ చెప్పిన‌ట్టు స‌మాచారం. మ‌రి అప్పటి వ‌ర‌కు సుధీర్ రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి క‌ల‌సి ప‌నిచేస్తారా అన్నది అస‌లు స‌మ‌స్య.
    రాజీఫార్ములాతో దెబ్బతిన్న టీడీపీ : జ‌మ్మల‌మ‌డుగు అంటేనే ఫ్యాక్షన్ ప్రాంతంగా ముద్ర ప‌డింది. దేవగుడి ఆదినారాయ‌ణ‌రెడ్డి కుటుంబానికి, గుండ్లకుంట రామ‌సుబ్బారెడ్డి కుటుంబాల మ‌ధ్యే భారీగా ఫ్యాక్షన్ న‌డిచింది. ఈ ఫ్యాక్షన్ లో ఎంద‌రో ప్రాణాలు కోల్పోయారు. ఉప్పు, నిప్పుల భ‌గ్గుమ‌నే ఈ రెండు కుటుంబాల మ‌ధ్య సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే రాజీఫార్ములాను ఉప‌యోగించారు. రామ‌సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి.. ఆదినారాయ‌ణ‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ద‌శాబ్ధాల ఫ్యాక్షన్ ఉన్న నేత‌లను క‌ల‌సి ప‌ని చేయించారు. కానీ.. వీరిద్దరు క‌లిసినంత సులువుగా కేడ‌ర్ క‌ల‌వ‌లేదు. ప్రజ‌లు కూడ ఈ కాంబినేష‌న్ తిర‌స్కరించారు. 2019 ఎన్నిక‌ల్లో సుధీర్ రెడ్డిని 50 వేల మెజారిటీతో గెలిపించారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి టీడీపీ త‌ర‌పున క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తే.. రామ‌సుబ్బారెడ్డి జ‌మ్మల‌మడుగు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ త‌ర‌పున పోటీచేసిన సుధీర్ రెడ్డి… రాముసుబ్బారెడ్డి మీద గెలిచారు. వెంట‌నే రామ‌సుబ్బారెడ్డి టీడీపీ వీడి.. వైసీపీలో చేరారు. దీంతో వైసీపీలో ముస‌లం మొద‌ల‌యింది.
    ట్రెండ్ మారిందా?.. ఫ్యాక్షన్ గ‌డ్డ మీద రాజ‌కీయాల ట్రెండ్ మారిందా అంటే స్పష్టమైన స‌మాధానం చెప్పలేం. ఎందుకంటే ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామసుబ్బారెడ్డి మ‌ధ్య కుదిర్చిన రాజీ ఏ విధంగా బెడిసి కొట్టిందో స్పష్టంగా అర్థమ‌యింది. నాయ‌కులు ర‌క‌ర‌కాల అవ‌స‌రాల నిమిత్తం మార్పు చెందుతూ ఉంటారు. కానీ, ఎమోష‌నల్ గా ఉండే చాలా మంది కార్యక‌ర్తలు క్షేత్ర స్థాయిలో క‌లిసి ప‌నిచేయ‌లేరు. ఇది ఇప్పటికే నిరూపితం అయింది. మ‌రి రామ‌సుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి ఏ విధంగా క‌లిసి ప‌ని చేస్తారో చూడాలి.

About Author