PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండలో… మిర్చి రైతులను ఆదుకోవాలని ఆందోళన

1 min read

పల్లెవెలుగు వెబ్​: అధిక వర్షాలకు బొబ్బర తామర వైరస్ రోగాల బారిన పడి దెబ్బతిన్న మిర్చి పంట రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య మాట్లాడుతూ, ఈ ఏడాది కురిసిన అకాల వర్షాలకు మిర్చి పంటలకు తెగులు ఏర్పడి  పంట పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారని అన్నారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసినా ఏదో రకంగా పంటలు దెబ్బతిని రైతులు నష్టాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం మిర్చి రైతులు కోలుకోని విధంగా దెబ్బ తిన్నారని అన్నారు. నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రైతు సంఘం ఆందోళనలు చేపట్టిందని తెలిపారు. ఈ క్రమంలో విజయవాడలో మిర్చి రైతులను ఆదుకోవాలని ఆందోళన చేస్తున్న రైతు నాయకులను ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులకు గురైన రైతు సంఘం నాయకులు తక్షణమే విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. మిర్చి రైతులను ఆదుకోవాలని నినాదాలు చేస్తూ దాదాపు అరగంట పాటు రైతులు ఆందోళన చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇన్చార్జి తాసిల్దార్ విష్ణు ప్రసాద్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గురు దాసు, ఎం కారన్న సురేంద్ర కుమార్, పెద్ద వీరన్న, రాజా సాహెబ్, నెట్టికంటయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author