‘స్థానిక’ ఎన్నికలో.. పీఓలు,ఏపీఓల పాత్రకీలకం
1 min readపోలింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి
– మున్సిపల్ కమిషనర్ డి.కె. బాలాజీ
పల్లెవెలుగు, కర్నూలు
ఈనెల 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పీఓలు, ఏపీఓల పాత్ర కీలకమని కర్నూలు మున్సిపల్ కమిషనర్ డి.కె. బాలాజీ అన్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్ సిబ్బంది సమన్వయంతో.. పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై పి ఓ లు, ఏపీ ఓ లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ డీ. కే. బాలాజీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ అధికారులు పోలింగ్ సామగ్రిని, 9వ తేదీన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బందికి కేటాయించిన వాహనాలలో జాగ్రత్తగా తీసుకువెళ్లాలన్నారు. 10న ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకూ పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని సాయంత్రం ఐదు గంటల తర్వాత వరుసలో నిలబడిన వారికి కూడా ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపల ఎటువంటి ప్రచారం కాని బ్యానర్లు కానీ ఉండకూడదని ఓటర్లు 200 మీటర్ల దూరంలో తమ వాహనాలు పార్కింగ్ చేసి పోలింగ్ కేంద్రానికి రావాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎన్నికల అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్, ప్రిసైడింగ్ అధికారికి మాత్రమే సెల్ ఫోన్ అనుమతి ఉంటుందన్నారు. మహిళలు, పురుషులు, వికలాంగులకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేసి ఓటింగ్లో పాల్గొనే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఈ ఎన్నికలలో పి ఓ లు పోలింగ్ స్టేషన్ కు ఓవరాల్ ఇన్చార్జిగా ఉంటారన్నారు.
ఎన్నికల సిబ్బంది తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఆటంకం కలిగించిన వారికి ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం మూడు నెలల జైలు శిక్ష మరియు అపరాధ రుసుం విధించడం జరుగుతుందన్నారు. ఎన్నికల సిబ్బంది తప్పకుండా గుర్తింపు కార్డులు ధరించాలన్నారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు బ్యాలెట్ బాక్స్ లు ఆపరేట్ చేసే విధానం, పేపర్ సీల్, బ్యాలెట్ బాక్సులు క్లాత్ బ్యాగులో పెట్టి లక్క సీలు వేసే విధానం, ఎన్నికల నిర్వహణకుసంబంధించిన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పి ఓ ల కు, ఏపీ ఓ లకు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, డ్వామ ఏపీ డి లు వెంగన్న,సిద్ధ లింగమూర్తి, సలీం భాష, పీవోలు, ఏపీవో లు తదితరులు పాల్గొన్నారు.