ఉద్యోగాల పేరుతో లక్షల రూ. ఘరానా మోసం
1 min readపల్లెవెలుగు, కల్లూరు అర్బన్ : కర్నూల్ నగరంలో గాయత్రి ఎస్టేట్ లోని ఎన్లైటెన్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ పేరుతో తమ పిల్లలకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నగరంలోని ఎన్లైటెన్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ నిర్వాహకులు నజీర్ అహ్మద్, కురువ నాగరాజు లు లక్షలాది రూపాయలు తమ నుంచి వసూలు చేశారని బాధిత మహిళలు ఎన్లైటెన్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు హసీనా, లక్ష్మి దేవి లు మాట్లాడుతూ సంస్థ నిర్వాహకులు నజీర్ అహ్మద్ మరో ఇద్దరు తమనుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సంవత్సరం క్రితం డబ్బులు వసూలు చేశారని, అయితే ఇంతవరకు స్పందించడం లేదని ఆరోపించారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం చెప్పడం లేదని, దాటవేసే ధోరణిలో ఉన్నారని ఆరోపించారు. డబ్బులు తిరిగి చెల్లించాలని కోరినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పోలీసు అధికారులు తమకు న్యాయం చేసి ఎన్లైటెన్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ సంస్థ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.