తహసీల్దార్‌పై..అనుచిత వ్యాఖ్యలు
1 min readమాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేయాలి
- వైసీపీ దెందులూరు దళిత ప్రజాప్రతినిధులు..
పల్లెవెలుగు, ఏలూరు: పెదవేగి తహసీల్దార్ నల్లమెల్లి నాగరాజు ను ఆయన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా దుర్భాషలాడి అవమాన పరిచినదెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏలూరు, దెందులూరు నియోజక వర్గాల దళిత ప్రజా ప్రతినిధులు, దళిత సంఘాలు నేతలు మంగళవారం ఉదయం స్థానిక పైర్ స్టేషన్ సెంటర్ వద్ద కదం తొక్కాయి. కొద్దీ సేపు అక్కడే బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దళిత ద్రోహి చింతమనేని డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పైర్ స్టేషన్ సెంటర్ లో చింతమనేని దిష్టి బొమ్మను దళిత సంఘాలు దగ్ధం చేశాయి. అనంతరం పైర్ స్టేషన్ నుండి జిల్లా పరిషత్ మీదగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని దళిత తహసీల్దార్ నల్లమెల్లి నాగరాజు ఆయన కుటుంబ సభ్యులను అవమాన పరిచేవిధంగా దుర్భాష లాడిన చింతమనేని ప్రభాకర్ ని వెంటనే అరెస్టు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లాఎస్పి ల ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే గా 10 ఏళ్ళు పదవిలో ఉన్నప్పుడు కొండల్లా, పర్వతాలలా ఉన్న పోలవరం గట్లను మింగేసారన్నారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టిని కూడా చింతమనేని వదల్లేదని ఆరోపించారు. దళితులను అవమానపరచే విధంగా నోరు పారేసుకోవడం ఆయనకు అలవాటని దళిత సంఘాల నాయకులు విమర్శించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు, కో ఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్, కార్పొరేటర్ లు గుడిపూడి రవికుమార్, జుజ్జువరపు విజయనిర్మల, తేరా ఆనాధ్, మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.