జియో చార్జీల పెంపు.. వినియోగదారులపై భారం
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ టారిఫ్స్ భారీగా పెంచింది. ఎయిర్ టెల్, వోడాఫోన్ బాటలోనే జియో నడిచింది. ప్రీపెయిడ్ టారిఫ్ 21 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. జియోఫోన్ ప్లాన్ సహా అన్‌లిమిటెడ్ ప్లాన్స్, వాయిస్, డేటా, డేటా యాడ్ ఆన్ ప్లాన్ల ధరలను 19.6 శాతం నుంచి 21.3 శాతం రేంజ్ లో పెంచినట్లు తెలిపింది. టెలికాం పరిశ్రమ ప్రస్తుత పరిస్థితులను తట్టుకుని నిలబడటమే కాకుండా మరింత బలోపేతం చేసే ప్రయత్నాలకు అనుగుణంగా ధరలు పెంచినట్టు చెప్పింది. మొత్తం 15 ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్ ధరలను పెంచినట్లు రిలయన్స్ జియో తెలిపింది. ప్రస్తుతం టారిఫ్ ధరలను పెంచినప్పటికీ.. అంతర్జాతీయంగా చూస్తే ఇవి ఇప్పటికీ కనిష్ఠ స్థాయిలోనే ఉన్నాయని పేర్కొంది. దీంతో వినియోగదారుల పెద్ద ఎత్తున భారం పడే అవకాశం ఉంది. గతంలో డిస్కౌంట్లతో ఆఫర్లు ఇచ్చిన మొబైల్ నెట్ వర్క్ సంస్థలు ఇప్పుడు ధరలు పెంచడం పై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.