సమస్యలు పరిష్కరించాలని గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మె
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర తపవుల ఉద్యోగుల సంఘం ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం స్థానిక పోస్టల్ కార్యాలయం ముందు తపాల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు అనేక కష్టనష్టాలకు ఓర్చి పోస్టల్ సేవలందిస్తున్న గ్రామీణ పోస్టల్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, గ్రామీణ పోస్టల్ ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ పోస్టల్ ఉద్యోగుల సంఘం నాయకులు భాషా శివ రంగస్వామి మాట్లాడుతూ, గ్రామీణ పోస్టల్ ఉద్యోగులు చాలీచాలని జీతాలతో అతి కష్టం మీద విధులు నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుదూర మారుమూల గ్రామాల్లో గ్రామీణ ప్రజలకు ఇన్సూరెన్స్, పొదుపు పథకాలు, ప్రభుత్వ అమలు చేసే సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల దరికి చేర్చడానికి తపాలా ఉద్యోగులు ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన కమలేష్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ నివేదిక సానుకూల అంశాలను ఇంతవరకు అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి కమలేష్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం గ్రామీణ ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలని, సీనియర్ తపాలా ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను ఇవ్వాలని, టార్గెట్ల భారాన్ని కుదించాలని, జీవిత ఆరోగ్య ఆరోగ్య బీమా పథకాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని అన్నారు. నిరవధిక సమ్మె కార్యక్రమంలో ఖాజా, నరసింహులు, మారెమ్మ, బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు.