2023లో చైనాను దాటేయనున్న భారత్ !
1 min readపల్లెవెలుగువెబ్ : భారతదేశం వచ్చే ఏడాదికల్లా చైనాను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఈ ఏడాది నవంబర్ 15తో ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కును దాటుతుందని తెలిపింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సోమవారం విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘భారత దేశ ప్రస్తుత జనాభా 141.2 కోట్లు. చైనా జనాభా 142.6 కోట్లు. 2023లో భారతదేశం చైనాను అధిగమిస్తుంది. 2050కల్లా ఇండియా జనాభా 166.8 కోట్లకు చేరుతుంది. అదే సమయంలో చైనా జనాభా క్రమంగా తగ్గి 131.7 కోట్లకు పరిమితం అవుతుంది’ అని తెలిపింది. ప్రపంచ జనాభా 800 కోట్ల మైలురాయిని దాటడం మానవ సమాజం ‘ఆరోగ్య రంగంలో సాధించిన అద్భుతమైన ప్రగతికి నిదర్శనం’ అని యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అన్నారు.