రాయలసీమలో.. ఇండిగో యాస్పిరేషన్ సిస్టమ్ చికిత్స
1 min read* 35 ఏళ్ల వ్యక్తికి కాలి రక్తనాళాల్లో గడ్డ కట్టిన రక్తం
* మరింత పైకి వెళ్తే ప్రాణాపాయం
* అత్యాధునిక చికిత్సతో నయం చేసిన డాక్టర్ మూడే సందీప్
* కిమ్స్ సవీరా ఆస్పత్రిలో అధునాతన సదుపాయాలు
అనంతపురం: కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి, అది దాదాపు ఉదరభాగం వరకు వెళ్లి ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి కేవలం ఒక్కరోజులోనే అత్యాధునిక చికిత్స చేసి అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు నయం చేశారు. ఆస్పత్రికి చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ మూడే సందీప్ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. “అనంతపురానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తికి కుడి కాలు విపరీతమైన వాపు, నొప్పి రావడంతో రాత్రి 9 గంటల సమయంలో కిమ్స్ సవీరా ఆస్పత్రికి వచ్చారు. ఆయనకు కుడి కాలి రక్తనాళంలో రక్తం గడ్డకట్టి, అది ఉదరభాగం వరకు వెళ్లిందని పరీక్షల్లో తేలింది. ఒకవేళ అది ఊపిరితిత్తులు, గుండె వరకు వెళ్తే ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. అందువల్ల అతడికి వెంటనే చికిత్స చేయాలి. అయితే, అప్పటికే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండటం, దగ్గుతున్నప్పుడు కళ్లితోపాటు రక్తం పడటం లాంటి సమస్యలు ఉండటంతో అతడికి థ్రాంబోలిసిస్ (రక్తం పల్చబరిచే ఇంజెక్షన్లు ఇవ్వడం) కుదరదు. అందువల్ల అత్యాధునికమైన పెనంబ్రా ఇండిగో యాస్పిరేషన్ సిస్టం సాయంతో మెకానిక్ థ్రాంబెక్టమీ అనే చికిత్స చేయాలని నిర్ణయించాం. రాయలసీమ ప్రాంతంలో ఈ అత్యాధునిక టెక్నిక్‌ను ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఈ చికిత్స కారణంగా రోగికి ఒక్కరోజులోనే పూర్తి ఊరట లభించింది. రోగికి అప్పటికే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య కూడా ఉండటంతో డాక్టర్ యశోవర్ధన్ నేతృత్వంలో అతడికి ఇంటర్‌కోస్టల్ డ్రైనేజ్ అనే ప్రక్రియ చేశారు. దాంతో అతడికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలిసింది. దానికి యాంటీబయాటిక్స్ వాడటంతో నయమైంది. ఫలితంగా ఒక్కరోజు తర్వాత అతడి ఆక్సిజన్ శాచ్యురేషన్ స్థాయి కూడా పెరిగింది. మొదట్లో విపరీతమైన కాలువాపు, నొప్పితో వచ్చిన ఆ వ్యక్తి.. చికిత్స అనంతరం హాయిగా నడుచుకుంటూ వెళ్లాడు” అని డాక్టర్ మూడే సందీప్ తెలిపారు. అప్పటికప్పుడే నొప్పి తగ్గించడమే కాక, ప్రాణాపాయం నుంచి కూడా కాపాడినందుకు రోగి, అతడి బంధువులు డాక్టర్ మూడే సందీప్‌కు, కిమ్స్ సవీరా ఆస్పత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ఏబీహెచ్ ఎక్రెడిటేషన్ కూడా ఉన్న కిమ్స్ సవీరా ఆస్పత్రిలో అత్యుత్తమ కార్డియాలజీ బృందం ఉంది. అత్యాధునిక చికిత్సాపద్ధతులు కూడా అందుబాటులో ఉండటంతో ఇక బెంగళూరు లాంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.