‘క్షయ’ అంటు వ్యాధి..!
1 min read
తుమ్మినా.. దగ్గినా.. ఇతరులకు సోకే ప్రమాదం..
- ఆరు నెలలపాటు మందులు వాడితే.. పూర్తిగా నయం..
- 2022 తో పోలిస్తే.. మరణాల సంఖ్య తగ్గు ముఖం
- క్షయ వ్యాధి వైద్య నిపుణులు డా. భాస్కర్
కర్నూలు, న్యూస్ నేడు:క్షయ వ్యాధిగ్రస్తులు తుమ్మినా… దగ్గినా … ఇతరులకు సోకే ప్రమాదం ఉందని… ఆరు నెలలపాటు క్రమం తప్పకుండా మందులు వాడితే పూర్తిగా నయం అవుతుందన్నారు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి క్షయ వ్యాధి వైద్య నిపుణులు ( హెచ్ ఓడి) డా. భాస్కర్. మార్చి 24న ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా శనివారం జీజీహెచ్ లోని తన ఛాంబరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో క్షయ వ్యాధి ని గుర్తించేందుకు ఉచిత గళ్ల పరీక్ష, ఎక్స్ రే మరియు ఆధునికమైన సిబి ఎన్ఏఏటి, ఆర్టీపీసీఆర్లతో పరీక్ష చేస్తారని తెలిపారు. క్షయ వ్యాధి గ్రస్తులు అంగన్ వాడి, ఆశా వర్కర్లు ఇచ్చే మందులు వాడితే నయం అవుతుందన్నారు. ప్రవేట్ ఆస్పత్రులు క్షయ వ్యాధిని గుర్తించినా, ప్రజలు కూడా వ్యాధి గ్రస్తుడిని గుర్తించి ప్రభుత్వానికి తెలిపితే రూ. 500 పారితోషికం ఇస్తారన్నారు. అదేవిధంగా వ్యాధి గ్రస్తుడికి చికిత్స సమయంలో నెలకు రూ. వెయ్యి పారితోషికం ప్రభుత్వమే అందజేస్తుందన్నారు. క్షయ వ్యాధిగ్రస్తుడికి పోషక ఆహారం నిమిత్తం ప్రతి నెల రూ.500 అకౌంట్ లో జమ అవుతాయన్నారు. గతంతో పోలిస్తే క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గిపోయిందని పేర్కొన్న డా. భాస్కర్ …. 2022 తో 2024లో మరణాల సంఖ్య కూడా తగ్గిపోయిందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వ్యాధి నివారణకు పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా క్షయ వ్యాధి వైద్య నిపుణులు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి డిపార్ట్ మెంట్ హెచ్ ఓ డి డా. భాస్కర్ కోరారు.