పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చేయాలి: సీపీఐ
1 min readపల్లెవెలుగు వెబ్, ఆస్పరి : పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేలా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడం దారుణమన్నారు సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య. మంగళవారం కర్నూలు జిల్లా ఆస్పరి సీపీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ట్రూఆప్ చార్జీల పేరిట పెంచిన విద్యుత్ చార్జీలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలపైనా భారాలను వేసే విధంగా వ్యవహరించడం దుర్మార్గమని, ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఆగస్టు నెల నుంచి విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ ఛార్జీల బాదుడు ప్రారంభమైందన్నారు. ప్రతి యూనిట్‌కు రూ.1.23 పైసల వంతున పేదలపై విద్యుత్ ఛార్జీల భారం వినియోగదారులపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై విద్యుత్ భారాలు మోపడం సిగ్గుచేటన్నారు. ట్రూఅప్ ఛార్జీల పేరుతో విధిస్తున్న భారాన్ని రద్దు చేసుకోవాలని లేనిపక్షంలో ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో ఏఐటియుసి తాలూక కార్యదర్శి మునిస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి, ఏఐటీయూసీ, సిపిఐ మండల నాయకులు హనుమంతు, గోవిందు, రామాంజనేయులు, వీరేశ్, రంగప్ప, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.