మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలపై విచారణ చేయండి
1 min read– శానిటరీ అధికారిణి ఆత్మహత్యాయత్నం పై సమగ్ర దర్యాప్తు చేయాలి
– అనంతపురం లో మున్సిపల్ ఆర్డీకి ఫిర్యాదు చేసిన సీపీఐ నాయకులు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలపై తక్షణమే విచారణ చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ఆత్మహత్యాయత్నంపై సమగ్ర విచారణ జరిపి అవినీతి అక్రమాలకు తావు లేకుండా అవినీతికి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నంద్యాల జిల్లా అధ్యక్షులు వి.రఘురాంమూర్తి,రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు అనంతపురం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ ,ఏఐఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం అనంతపురం లోని మున్సిపల్ ప్రాంతీయ సంచాలకులు మరియు అప్పిలెట్ కమిషనర్ పివివిఎస్ మూర్తిని ఆయన ఛాంబర్ లో కలిసి మాట్లాడి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అనేక రోజుల నుండి నందికొట్కూరు మున్సిపాలిటీ లోని శానిటరీ అధికారిణిగా బాధ్యతల విషయంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయన్నారు.ప్రజల సమస్యలు పట్టించుకోకుండా అధికారుల మధ్య కొమ్ములాటలు, అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి అన్నారు.ఒక మహిళ ఉద్యోగి సునీత ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయో విచారణ చేయాలన్నారు. సాక్షాత్ ఇది జరుగుతున్న చూసి చూడనట్లు వ్యవహరించడం తగదు అన్నారు. తక్షణమే మున్సిపాలిటీ లో ఉన్న అధికారుల పనితీరు,బిల్లుల విషయం తదితర విషయాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఆర్డీ స్పందిస్తూ నందికొట్కూరు మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలు నా దృష్టికి కూడా వచ్చాయని ఈ విషయాలపై తక్షణమే సీనియర్ అధికారి చే దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటానని వారు హామీ ఇచ్చారు.