జడ్జీల పై దూషణలు ప్రమాదకరం !
1 min readపల్లెవెలుగువెబ్ : బీజేపీ బహిష్కిృత నేత నూపుర్‌శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై.. ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా స్పందించారు. ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో తమపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని.. న్యాయానికి ఇది ప్రమాదకరమని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఇది ఇలాగే కొనసాగితే న్యాయమూర్తులు న్యాయం ఏం చెబుతుందనే విషయం కన్నా.. మీడియా ఎలా ఆలోచిస్తుందనే అంశంపైనే దృష్టి పెట్టాల్సిన పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పులపై నిర్మాణాత్మక విమర్శల కన్నా.. ఆ తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే ధోరణి సోషల్, డిజిటల్ మీడియాలో బాగా పెరుగుతోందని.. చట్టబద్దమైన పాలనను కాపాడాలంటే సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.