పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయండి
1 min read
పారిశుద్ధ్య పర్యవేక్షక సిబ్బందితో మంత్రి టీ.జీ. భరత్
పారిశుద్ధ్యం లోపిస్తే సంబంధిత వారిదే బాధ్యత
గార్బేజ్ పాయింట్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి
ప్రభుత్వ ఆస్తులపై బ్యానర్లు, పోస్టర్లు అతికిస్తే చర్యలు తీసుకోండి
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం నగరంలో పారిశుద్ధ్య పనులను మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పారిశుద్ధ్య పర్యవేక్షక సిబ్బందిని ఆదేశించారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కమిషనర్ యస్.రవీంద్ర బాబుతో కలిసి పారిశుద్ధ్య పర్యవేక్షకులు, కార్యదర్శులు, మేస్త్రిలతో పారిశుద్ధ్యంపై మంత్రి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగరంలో పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు ఎక్కువ అయ్యాయని, వాటిపై పర్యవేక్షక సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పునరావృతం అవుతున్న సమస్యలు ఫిర్యాదులు వచ్చేంత వరకు వేచి ఉండకుండా, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో పారిశుద్ధ్య మెరుగుపడకపోతే, ఎక్కడైనా పారిశుద్ధ్యం లోపిస్తే సంబంధిత సిబ్బందే బాధ్యత అని, వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పారిశుద్ధ్యంలో విశాఖపట్నం తరహాలో నగరాన్ని తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గార్బేజ్ పాయింట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని, రహదారులపై చెత్తా వేసే వారిని గుర్తించి హెచ్చరించాలని, అయినప్పటికీ వినకపోతే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారులు, కూడళ్లపై బ్యానర్లు, పోస్టర్లు అతికించే వారిపై సైతం చర్యలు తీసుకునేందుకు ఉపేక్షించొద్దని ఆదేశించారు. సిసి కెమెరాలకు అడ్డంగా ఏవైనా బ్యానర్లు కడితే ఆ సమయంలో అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే బ్యానర్లు కట్టిన వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, మురుగు కాలువలపై ఆక్రమణలు, కాలువలు ఎక్కుతక్కులను సరిచేయించుకునే బాధ్యత పారిశుద్ధ్య పర్యవేక్షక సిబ్బంది తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటి చెత్తా సేకరణ వంద శాతం చేపట్టాలని, రహదారులపై, మురుగు కాలువల్లో చెత్తాచెదారం వేస్తే కలిగే అనర్ధాలను ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. నగరంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, తద్వారా కర్నూలుతో పాటు సమీప మున్సిపాలిటీల్లో వెలువడే వ్యర్ధాలతో విద్యుత్ తయారు చేయవచ్చన్నారు. మురుగు కాలువల్లో ఉన్న తాగునీటి పైప్‌లైన్‌లను తొలగించేందుకు ప్రతిపాదనలను రూపొందించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, ఇంచార్జీ యస్ఈ శేషసాయి, ఎంఈ సత్యనారాయణ, పట్టణ ప్రణాళిక సర్వేయర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
