ఏపీఎన్జీవోస్’ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
1 min read
కుటుంబంలో ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం,దేశంఅభివృద్ధి చెందుతుంది
జిల్లా కలెక్టర్ కె వెట్రీసెల్వి
వివిధ శాఖలలో ఉత్తమ సేవలందించిన మహిళ ఉద్యోగినులకు మెమెంటోలు బహుకరణ
ఆహుతులను ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఏపీఎన్జీవోస్’నాయకులకు జిల్లాకలెక్టర్ అభినందనలు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : మహిళాభివృద్దికి విద్య ఎంతో ముఖ్యమని, కుటుంబంలో ఒక మహిళా విద్యావంతురాలైతే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. అంతర్జాతీయ మహిళా వారోత్సవాలలో భాగంగా స్థానిక జిల్లాపరిషత్ సమావేశపు హాలులో శుక్రవారం రాత్రి ఏ పి ఎన్జీవోస్ ఏలూరు వైభవం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్యఅతిథి గా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ విద్యతోనే ప్రగతి సాధ్యమని, ప్రతీ ఇంట్లో బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతీ మహిళా విద్యావంతురాలైతే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలు పురుషులకు ఏ విషయంలో కూడా తీసిపోరని, అన్ని రంగాలలో పురుషులకంటే మహిళలు బాధ్యతతో, అంకితభావంతో పనిచేస్తారన్నారు. మహిళల సాధికారతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో చేయూతను ఇస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతీ మహిళా ప్రగతిపధంలో నడవాలన్నారు. మన దేశానికీ చెందిన మహిళలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమసత్తాను చాటి, మన దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతీ మహిళా తనకు అభిరుచి ఉన్న రంగంలో అభివృద్ధి చెందేందుకు ప్రయత్నించాలని, అందుకు ప్రోత్సాహం వారి ఇంటినుండే ప్రారంభం కావాలన్నారు. ఇటీవల ఎన్నికల నిర్వహణలో మహిళలు ఎంతో బాధ్యతగా విధులు నిర్వర్తించారన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖలలో ఉత్తమ సేవలందించిన మహిళా ఉద్యోగినులకు మెమొంటోలను కలెక్టర్ బహూకరించారు. నిర్వాహకులు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏపీఎన్జీవోస్’ జిల్లా నాయకులకు కలెక్టర్ అభినందనలు తెలియజేశారు.కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఆర్.వి. నాగరాణి, ఐసిడిఎస్ పీడీ పి.శారద, మహిళ సీఐ, ఏ.పి. ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు వెంకట రామారావు, ఏ. పి . ఎన్జీవోస్ నాయకులు హరనాథ్, మరియు గొర్ని శ్రీధర్ రాజు, జిల్లా ట్రెజరీ ఉద్యోగుల కార్యదర్శి కప్పల సత్యనారాయణ,వివిధ శాఖల మహిళఉద్యోగినులు పాల్గొన్నారు.