అట్టహాసంగా… పిల్లల పండుగ
1 min read– అట్టహాసంగా ప్రారంభమైన కర్నూలు బాలోత్సవం
– నైపుణ్యాల ప్రదర్శనకు మంచి వేదిక : డీఈఓ రంగారెడ్డి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు బాలోత్సవం సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మాంటిస్సోరి ఇండస్ పాఠశాలలో తొలి రోజు పిల్లల పండుగ కన్నులపండుగగా సాగింది. తొలుత మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత కళ్యాణమ్మ చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ జెండాను డీఈఓ రంగారెడ్డి, బాలోత్సవం జెండాను రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి.పుల్లయ్య ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రారంభ సభలో డీఈఓ రంగారెడ్డి మాట్లాడుతూ చాలా మంది పిల్లలు వారి నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు వీలు లేకుండా పోతోందని, నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఇది మంచి వేదికని తెలిపారు. బాలలకు ఇష్టమైన వాటిని ప్రదర్శించడం, ఇతర ప్రదర్శనలు తిలకించడమే బాలల ఉత్సవం అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లలు ఉల్లాసంగా ఉంటారన్నారు. ఆడుతూ నేర్చుకోవడం ద్వారా చక్కగా నేర్చుకోవచ్చన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం, దానికి సహకరించడం అవసరమని తెలిపారు. బాలోత్సవం దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షించారు. రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి.పుల్లయ్య మాట్లాడుతూ పాఠాల నుండి విశ్రాంతికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. అన్ని పోటీలు ఒకే చోట జరగడం అరుదని, ఆ అవకాశం ఇక్కడ దక్కిందని తెలిపారు. పాఠశాలలోని వందల మందిలో ఇక్కడి వచ్చిన అందరూ విజేతలేనన్నారు. విద్యార్థులందరూ తమలో ఉన్న కళపై శ్రద్ధ పెట్టి మరింత నైపుణ్యాన్ని సాధించాలని కోరారు. టిజివి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ నగరంలో ఆటలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు మైదానాలు తక్కువ అయిపోయాయని, ఇది మంచి వేదిక అని తెలిపారు. ప్రయివేట్ విద్యాసంస్థల యాజమాన్యాల జిల్లా అధ్యక్షులు పివిబి సుబ్బయ్య మాట్లాడుతూ కళ్యాణమ్మ విద్యను ప్రోత్సహించే వారని, ఆమె పేరుతో వేదిక ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అమరావతి బాలోత్సవం కార్యదర్శి రామరాజు మాట్లాడుతూ పిల్లలకు ఒత్తిడి లేకుండా చదువుకునే అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారన్నారు. ఒక ఆటవిడుపుగా బాలోత్సవం ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని కొత్త జిల్లాల్లోనూ, మండలాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు. జానపద, క్లాసికల్ నృత్యాలతో చిన్నారులు అలరించారు. కార్యక్రమంలో మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత రాజశేఖర్, యుటిఎస్ రాష్ట్ర సహాద్యక్షులు సురేష్ కుమార్, కర్నూలు బాలోత్సవం కార్యదర్శి జెఎన్ శేషయ్య, కన్వీనర్లు కెంగార మోహన్, ఎంపి బసవరాజు, కమిటీ సభ్యులు ఎస్ఎం జయరాజు, టి.నరసింహా పాల్గొన్నారు.