స్వచ్ఛ నందికొట్కూరు ఇదేనా..?
1 min read– రోడ్లపైకి మురుగునీరు..పట్టించుకోని అధికారులు..
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు : స్వచ్ఛ నందికొట్కూరు లక్ష్యం.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని అధికారులు,ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు నీటిమాటలేనా అని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని కేజీ రహదారిపై మురుగునీరు కాలువలై ప్రవహిస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. మురుగు ఎక్కడ పడితే అక్కడ నీటి నిల్వలు ఉండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూరు రోడ్ లోని ఒక హోటల్ నుంచి మురుగు నీరు రహదారులపై ప్రవహిస్తుండడంతో పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వెదజల్లుతోంది.
హోటల్ నుంచి వచ్చే మురుగు నీరు పటేల్ కూడలి వరకు ప్రవహిస్తుంది. వివిధ గ్రామాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు , ప్రజలు మురుగు నీటి వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హోటల్ పక్కనే ప్రవేట్ వైద్యశాల ఉంది. వైద్యశాలకు వస్తున్న గర్భిణిలు మురుగు నీటి దుర్గందంతో అవస్థలు పడుతున్నారు . వర్షాకాలం కావడంతో నీటి నిల్వలు ఉండకుండా చర్యలు చేపట్టాల్సిన అధికారులు,పాలకులు వాటిపై శ్రద్ధ చూపడం లేదని ప్రజలు వాపోతున్నారు. నిత్యం మున్సిపాలటీ అధికారులు తిరుగాడే రహదారి ప్రదేశంలో మురుగు నీటి నిల్వలు కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.