పాలస్తీనాపై కిరాతక నేరాలకు పాల్పడుతున్న ఇజ్రాయిల్ ను శిక్షించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినం సందర్భంగా కర్నూల్ నగరం లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద పౌర చైతన్య వేదిక(PCV) ఆధ్వర్యంలో పాలస్తీనాపై కిరాతక నేరాలకు పాల్పడుతున్న ఇజ్రాయిల్ ను శిక్షించాలని, బిజెపి పాలనలో ప్రజాస్వామ్య హక్కుల అణచివేతను నిరోధించాలని, క్రిమినల్ చట్టాలకు కేంద్రం చేస్తున్న అప్రజాస్వామ్య సవరణలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు, మహిళలు, ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పౌర చైతన్య వేదిక నగర ఇన్చార్జి ఎం. తేజోవతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వలస కాలం నాటి వారసత్వాన్ని తొలగిస్తామనే పేరుతో క్రిమినల్ చట్టాలకు చేస్తున్న సవరణలు అనేవి నామమాత్రంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య హక్కులను, పౌరుల స్వేచ్ఛను పూర్తిగా హరించివేసే విధంగా ఉన్నాయని చెప్పారు. ప్రజల న్యాయబద్ధ, ప్రజాస్వామ్య నిరసన రూపాలను అవి అహింసాత్మకమైన లేదా శాంతియుత నిరసనైనా లేదా సాంఘిక రాజకీయ ఆర్థిక న్యాయాన్ని సాధించడానికి చేసే చర్చ అయినా వాటిని టెర్రరిస్ట్ చర్యగా బ్రాండ్ చేయడానికి అధికారులకు హద్దులు లేని అధికారాన్ని అందిస్తాయని అనే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణలు ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ప్రమాదం తెస్తాయని ఆమె విమర్శించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఉపన్యాసకులుగా విచ్చేసిన సీనియర్ న్యాయవాదులు కె.ఓంకార్మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగానూ, మన భారతదేశంలోనూ పౌరుల హక్కులకు భంగం వాటిల్లు తోందని, పౌరుల హక్కులను కాలరాచే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. IPC, Crpc, Evidence చట్టాలలో ప్రభుత్వం చేపడుతున్న సవరణలు అప్రజాస్వామికమైనవని, వాటిని వ్యతిరేకించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం అందించిన ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను పరిరక్షించడానికి ప్రజలు ఉద్యమించాలని అయన పిలుపు నిచ్చారు. సీనియర్ న్యాయవాది ఎం.ఆర్.కృష్ణ మాట్లాడుతూ చట్టాల పై, సామాజిక సమస్యలపై అవగాహన లేని వారు చట్టాలను రూపొందిస్తున్నారని వాపోయారు. OPDR కార్యదర్శి ఆర్.నరసింహులు మాట్లాడుతూ యుద్దాలు ఎక్కడ జరిగిన సామాన్య ప్రజలు బలైతున్నారని, యుద్దాలు ఎక్కడ జరిగిన మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మానవ హక్కుల పరరక్షణకై పాటుపడాలని లేని యెడల మానవ జాతి మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో OPDR జిల్లా అధ్యక్షులు కర్ణాకర్, ఇతర న్యాయవాదులు షాబుద్దిన్ బాబుసాహెబ్, మదన్ రెడ్డి, రైతు సంఘం నాయకులు ఖాదర్ బాషా, కార్మిక సంఘం నాయకులు నాగన్న , మహిళా సంఘం నాయకులు ప్రియాంక, రోజా మరియు మహిళలు పాల్గొన్నారు.