PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డిజిటల్ యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం లేకుండా రాణించడం కష్టం

1 min read

ఫస్ట్ స్టెప్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి కంప్యూటర్ శిక్షణా తరగతులను ప్రారంభించిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రపంచవ్యాప్తంగా డిజిటలైజేషన్, కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో కంప్యూటర్ పై పరిజ్ఞానం లేకుండా ఏ రంగంలోనూ రాణించడం కష్టం అని ప్రముఖ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు .కర్నూల్ నగరంలోని భాగ్యనగర్ లో ఉన్న ఫస్ట్ స్టెప్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో తన సౌజన్యంతో ఏర్పాటు చేసిన విద్యార్థులకు వేసవి కంప్యూటర్ శిక్షణ తరగతులను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ స్టెప్ కంప్యూటర్స్ అధినేత రాజశేఖర్ ,మేనేజర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యా స్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాసి ఖాళీగా ఉన్న విద్యార్థులు వేసవిలో సమయం వృధా చేయకుండా కంప్యూటర్ పై పరిజ్ఞానం పొందించుకునేందుకు వేసవి శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. పదవ తరగతి పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులు సాధారణంగా వేసవి సెలవులను ఇతర కార్యక్రమాలతో సమయం వృధా చేయడం సహజంగా జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న మండుటెండల నేపథ్యంలో విద్యార్థులు ఆటపాటలతో సమయం వృధా చేయడంతో పాటు వడదెబ్బ లాంటి ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు. అలాకాకుండా ఈ వేసవి సెలవులను కంప్యూటర్ శిక్షణ ద్వారా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఫస్ట్ స్టెప్ కంప్యూటర్ సెంటర్ ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం ,అందులో తాను భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నానని వివరించారు .గత 24 సంవత్సరాలుగా ఫస్ట్ స్టెప్ కంప్యూటర్ సెంటర్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు ఉద్యోగులకు కంప్యూటర్ పై శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన సంస్థ అధినేత రాజశేఖర్ ను ఆయన అభినందించారు. విద్యార్థులు కంప్యూటర్ను ఆపరేట్ చేయడంపై అవగాహన పెంపొందించుకుంటే ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఆయా రంగాలలో రాణించే అవకాశం ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో ప్రస్తుతం డిజిటలైజేషన్ అమలులో ఉందని ఇందులో రాణించాలంటే మొదటి అడుగు కంప్యూటర్లో పరిజ్ఞానం ఉండాలని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని , ఇందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో రానున్న రోజుల్లో కృత్రిమ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మేదస్సు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని , ఇందుకు అనుగుణంగా ఆయా రంగాలలో ఉన్నవారు తమ నైపుణ్యాలకు మెరుగుపరుచుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే కంప్యూటర్ శిక్షణ తరగతుల నిర్వహణకు తన వంతు సహకారం అందిస్తానని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెలడించారు. అనంతరం ఫస్ట్ స్టెప్ కంప్యూటర్స్ అధినేత రాజశేఖర్ మాట్లాడుతూ వైద్యవృత్తిలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులకు సహకారం అందించడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన డాక్టర్ శంకర్శర్మకు తమ సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన వివరించారు .అన్ని దానాలలో అన్నదానం గొప్పదని అంటారని కానీ ఒక వ్యక్తి జీవితానికి ఉపయోగపడే విద్యాదానం అంతకంటే గొప్పదనీ భావించే తాము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తమ ఉద్దేశాన్ని గమనించి సహకారం అందించిన డాక్టర్ శంకర్ శర్మకు మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు.

About Author