PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లింల‌ను కాపాడుకునే బాధ్యత నాది.. టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

1 min read

న‌గ‌రంలోని చౌక్‌లో ముస్లిం పిలుపు.. టిడిపి గెలుపు పేరుతో రోడ్ షో

బీజేపీతో పొత్తు ఉంద‌ని ముస్లింలకు ఆందోళ‌న అవ‌స‌రం లేదు

ఏ బిల్లులు అమ‌లైనా ముస్లింల‌కు అండ‌గా నేనుంటా

న‌న్ను న‌మ్మి ఎమ్మెల్యేగా గెలిపించండి

ఒక్క ముస్లిం కుటుంబానికి అన్యాయం జ‌రిగినా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తా.. టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూలు న‌గ‌రంలోని ముస్లింలంద‌రికీ తాను అండ‌గా ఉంటాన‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి టి.జి భ‌ర‌త్ భ‌రోసా ఇచ్చారు. టిడిపి బీజేపీతో పొత్తు పెట్టుకున్నందు వ‌ల్ల ముస్లింల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని కొంద‌రు స్వార్థ ప‌రులు చెప్పే మాట‌లు నమ్మొద్దన్నారు. ముస్లింల‌ను కాపాడుకునే బాద్యత తాను తీసుకుంటాన‌ని టి.జి భ‌ర‌త్ హామీ ఇచ్చారు. ప్రజాసేవ చేసే టి.జి కుటుంబం నుండి వ‌చ్చిన వ్యక్తిగా త‌న‌కు ఓటేసి గెలిపించాల‌ని కోరారు. ఎన్.ఆర్.సి, సి.ఎ.ఎ ఇలా ఏ బిల్లు అయినా రాని.. క‌ర్నూల్లో ఒక్క ముస్లిం కుటుంబానికి అన్యాయం జ‌రిగినా త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికే రాజీనామా చేస్తాన‌ని టి.జి భ‌ర‌త్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. న‌గ‌రంలోని చౌక్ బ‌జార్లో ముస్లిం పిలుపు.. టిడిపి గెలుపు పేరుతో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముస్తాక్ మౌలానా, ముస్లిం నేత‌లు పాల్గొన్నారు.

లోకల్ వర్సెస్ నాన్ లోకల్ మధ్య పోటీ

రానున్న ఎన్నిక‌ల్లో క‌ర్నూల్లో లోక‌ల్ వ‌ర్సెస్ నాన్ లోక‌ల్ మ‌ధ్య పోటీ జ‌రుగుతుంద‌న్నారు. ద‌శాబ్దాలుగా క‌ర్నూల్లో ఉంటూ ప్రజ‌ల‌కు సేవ చేస్తున్న త‌మ‌ను గెలిపిస్తే ప్రజ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. కులం చూడ‌కుండా తాము ఎలాంటి వ్యక్తుల‌మో అంద‌రూ గుర్తించాల‌ని భ‌ర‌త్ సూచించారు. తాము అన్ని కులాలు, మ‌తాల‌ను స‌మానంగా చూస్తామ‌ని తెలిపారు. అందుకే త‌మ ద‌గ్గర ముస్లింలు కూడా ద‌శాబ్దాలుగా ప‌ని చేస్తున్నార‌న్నారు. తాము కుల‌, మ‌త బేధాలు చూపిస్తే ఇన్నేళ్లుగా ఎందుకు ఉంటార‌ని ప్రశ్నించారు. కేవ‌లం ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందేందుకు త‌మ గురించి ఇష్టమొచ్చిన‌ట్లు మాట్లాడ‌తార‌ని చెప్పారు. తాము ముస్లింల‌కు కీడు చేశామ‌ని చెప్పడానికి ఒక్క ఉదాహ‌ర‌ణైనా ఉందా అని ఆయ‌న ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంద‌న్నారు. క‌ర్నూల్లో త‌న‌ను గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా కృషి చేస్తాన‌న్నారు. తాను తీసుకొచ్చిన 6 గ్యారెంటీలు ఐదేళ్లలో త‌ప్పకుండా అమ‌లు చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇది చేయ‌ని ప‌క్షంలో రాజ‌కీయాల నుండి త‌ప్పుకుంటాన‌న్నారు. ఈ ఎన్నిక‌ల్లో త‌నకు ఓటు వేసి గెలిపించి త‌న ప‌నితీరు చూడాల‌ని టి.జి భ‌ర‌త్ కోరారు.జ‌గ‌న్ ప్రభుత్వంలో ముస్లింల‌కు అన్యాయం.. టిడిపి రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముస్తాక్ మౌలానా వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో ముస్లింల‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని టిడిపి రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముస్తాక్ మౌలానా మండిప‌డ్డారు. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ హ‌మీలిచ్చి గెలిచిన త‌ర్వాత వాటిని అమ‌లు చేయ‌లేద‌న్నారు. దుల్హ‌న్ ప‌థ‌కానికి నిబంధ‌న‌లు పెట్టి అర్హుల‌కు అంద‌కుండా చేశార‌ని ధ్వజ‌మెత్తారు. ఇలాంటి నిబంధ‌న‌లు ఉంటాయ‌ని ముందే ఎందుకు చెప్పలేద‌ని ఆయ‌న ప్రశ్నించారు. ఇక ఈ నాయ‌కులు రూ. 5వేల కోట్ల మైనారిటీల సొమ్మును మింగేశార‌ని ఆరోపించారు. ముస్లింల కోసం చంద్రబాబు నాయుడు ఉర్దూ యూనివ‌ర్శిటీ ఏర్పాటు చేయ‌ద‌లిస్తే.. ఈ ప్రభుత్వంలో నిధులే కేటాయించ‌లేద‌న్నారు. వైసీపీ పాల‌న‌లో ముస్లింల‌కు ర‌క్షణ లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఇక ఎన్నిక‌లొచ్చాయ‌ని క‌ర్నూల్లో మ‌త విధ్వేషాలు రెచ్చగొడుతున్నార‌న్నారు. క‌ర్నూలు ప్రజ‌ల‌కు టి.జి వెంక‌టేష్ ఎంతో సేవ చేశార‌న్నారు. ఆయ‌న బాట‌లోనే సేవ చేసేందుకు టి.జి భ‌ర‌త్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌న్నారు. రానున్న ఎన్నికల్లో టి.జి భ‌ర‌త్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాల‌ని, రాష్ట్రంలో చంద్ర‌బాబును ముఖ్యమంత్రిని చేసుకుందామ‌ని పిలుపునిచ్చారు. అప్పుడే యువ‌కులు, మ‌హిళ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యద‌ర్శి అబ్దుల్  రజాక్, జ‌న‌సేన క‌ర్నూలు ఇంచార్జి అర్షద్, టిడిపి రాష్ట్ర ఆర్గ‌నైజింగ్ సెక్రట‌రీ మ‌న్సూర్ ఆలీఖాన్, కార్పోరేట‌ర్ ల‌తీఫ్‌, మైనారిటీ క‌మిటీ న‌గ‌ర అధ్య‌క్షుడు హ‌మీద్, తెలుగు యువ‌త పార్లమెంట్ అధ్యక్షుడు అబ్బాస్, తెలుగు మ‌హిళా పార్ల‌మెంట్ అధ్యక్షుడు ముంతాజ్, నేత‌లు నౌషాద్, ఇబ్రహీం, మెహ‌బూబ్, మెహ‌బూబ్ ఖాన్‌, జుబేర్ ఆలీ ఖాన్, గౌస్ మోయినుద్దీన్, అబ్దుల్ రజాక్. అన్వర్, ఖాజా మోయినుద్దీన్, షేక్ ఖాజా, మున్నా షా న‌వాజ్, స‌లీం ఖాన్, ఫిరోజ్, రెహ్మత్, అజ్మత్, అస్వర్, మోయిన్, షోయూబ్, అబ్బాస్, త‌దిత‌ర ముఖ్య నాయ‌కులు, బూత్ ఇంచార్జీలు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author