సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత యువతదే..
1 min readకర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
కె.వి సుబ్బారెడ్డి ఫార్మసీ కళాశాలలో యువతతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న టి.జి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత యువతపైనే ఉందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగర శివారులోని కె.వి సుబ్బారెడ్డి ఫార్మసీ కళాశాలలో విద్యార్థులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఎలాంటి నాయకుడు ఉంటే సమాజానికి మేలు జరుగుతుందన్న అంశంపై చర్చించారు. విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే యువత భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తారన్నారు. భావితరాల అభివృద్ధికి ముందు చూపుతో ఆలోచించే వ్యక్తి చంద్రబాబు అని విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరూ వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని టి.జి భరత్ కోరారు. కర్నూల్లో తనను గెలిపిస్తే పారిశ్రామికవేత్తగా తనకున్న అనుభవంతో కర్నూలుకు ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగం పెరిగిపోతున్న తరుణంలో పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. యువత వేసే ప్రతి అడుగు ఎంతో కీలకమన్నారు. ఈ ప్రభుత్వంలో విద్యార్థులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తమ ప్రభుత్వంరాగానే పాత విధానాలను సరికొత్తగా అమలుచేసి అందరికీ న్యాయం చేస్తామని భరత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కె.వి సుబ్బారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్, పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు ముంతాజ్, శ్రీకాంత్ రెడ్డి, రాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.