రాష్ట్రంలో టిడిపి గెలవడం ఎంతో అవసరం.. టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కర్నూల్లో అవసరమైన అన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటిన్లు ఏర్పాటుచేసేందుకు కృషి చేస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. సోమవారం నగరంలోని 25 వ వార్డు బిర్లాగడ్డలో ఒక్కరోజు అన్న క్యాంటిన్ కార్యక్రమంతో పాటు సభ్యత్వం నమోదు, బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిజి భరత్ పాల్గొని అన్న క్యాంటిన్ ద్వారా ఉచితంగా ప్రజలకు అన్నం పెట్టారు. అనంతరం టిజి భరత్ మాట్లాడుతూ కర్నూల్లో మా టీజీవీ సంస్థల తరుపున ఎలాగైతే ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటుచేశామో.. అలాంటి ఉద్దేశంతోనే రాష్ట్రంలో అన్న క్యాంటిన్లను చంద్రబాబు పెట్టారన్నారు. టిడిపి ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో ఇసుకను ఉచితంగా అందజేస్తామని ఇటీవలే నారా లోకేష్ ప్రకటించారన్నారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఎలాగైనా కర్నూలుకు పరిశ్రమలు తీసుకువస్తానని యువతకు మాట ఇస్తున్నట్లు భరత్ చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయన్నారు. భవిష్యత్తు ఎలా ఉండాలో ప్రజలు ఆలోచించుకొని ఓటు వేయాలని కోరారు. తమ టిజివి సంస్థల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని… అదే ప్రభుత్వంలో ఉంటే మరెన్నో చేస్తామన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా నేతలంతా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానికులు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధికార కమిటీల రాష్ట్ర కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్, సీనియర్ నాయకులు నాగరాజు యాదవ్, టిడిపి నగర అధ్యక్షుడు గున్నామార్క్, తెలుగుయువత పార్లమెంటు అధ్యక్షుడు అబ్బాస్, నేతలు రామాంజనేయులు, రాజశేఖర్ యాదవ్, బాలు, మహేష్, చరణ్, పోతురాజురవి, వినోద్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.