ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు
1 min readపల్లెవెలుగు వెబ్: ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన చేసింది. దక్షిణ బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించిందని వెల్లడించింది. ఇది పశ్చిమదిశగా ప్రయాణించే అవకాశం ఉందని, దీనివల్ల అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని కారణంగా రాగల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.